ఆత్మకూరు(ఎం), జనవరి 3 : అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ ద్వారా 400 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని వీర్ల చెరువుకు గోదావరి జలాలు తరలివచ్చాయి. దీంతో శుక్రవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో రూ.1.30కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువును అభివృద్ధి చేసి కట్టను పటిష్టంగా నిర్మించామని చెప్పారు. నేడు గోదావరి జలాలు గ్రామంలోని వీర్ల చెరువుకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సొమ్ము ఒకడిది.. సోకు మరొకడిదిలా కాంగ్రెస్ నాయకులు గోదావరి జలాలను తామే తెచ్చామని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మండలంలోని బిక్కేరు వాగుపై మోదుగుబావిగూడెం, టీ రేపాక, పారుపల్లి, కామునిగూడెం, కొరటికల్ గ్రామాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, కోరె భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
కూనూరు చెరువు వద్ద
భువనగిరి కలెక్టరేట్ : కాళేశ్వరం, కొండపోచమ్మ, బస్వాపూర్ నృసింహ రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా వచ్చిన గోదావరి జలాలతో భువనగిరి మండలంలోని కూనూరు చెరువు అలుగుపోస్తున్నది. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు అలుగు వద్ద పూజలు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్‌నేతలు పాల్గొన్నారు.