ధర్మారం/రామడుగు, జనవరి 9: తెలంగాణ వరప్రదాయిని ‘కాళేశ్వరం’ గంగ నలుదిశలా పారుతున్నది. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు, ఏ ప్రాంతంలోని సాగునీటి అవసరానికికైనా ఉపయోగపడుతున్నది. ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లాలోని గాండ్లపేట వద్ద వరద కాలువకు గండి పడటంతో ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటిని విడుదల చేయలేని దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పంటల సంరక్షణ కోసం కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో భాగమైన పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి బరాజ్ నుంచి నీటిని నందిమేడారం, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా వరద కాలువలో ఎత్తిపోయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని నంది పంప్‌హౌస్ ద్వారా ఎల్లంపల్లి బరాజ్‌లోని నీటిని రెండు రోజులుగా ఎత్తిపోస్తున్నారు. గురువారం ఉదయం ఒక మోటర్ ఆన్ చేసి ఎత్తిపోతలు మొదలు పెట్టిన అధికారులు.. శుక్రవారం ఉదయం 5వ మోటర్‌ను ఆన్ చేసి 3,150 క్యూసెకులు నంది రిజర్వాయర్, లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్, గ్రావిటీ కాలువ ద్వారా వరదకాలువలోకి పరుగులు తీస్తున్నది. శుక్రవారం సా.4 గంటల వరకు గాయత్రీ పంప్ హౌజ్ నుంచి 0.31టీఎంసీలను ఎత్తిపోశారు.