జయశంకర్ భూపాలపల్లి, మే 24 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. శనివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుష్కర స్నానం ఆచరించి, దైవదర్శనం చేసుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు వన్ వే ఏర్పాటు చేసినా పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
బస్టాండ్ నుంచి పుష్కర ఘాట్ వరకు ఏర్పాటు చేసిన ఉచిత బస్సులు సరిపోకపోవడంతో భక్తులు కాలినడకన వెళ్లి స్నానాలు ఆచరించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ పర్యవేక్షించారు. ఆదివారం సెలవు రోజు కావడం, సోమవారం చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. సరస్వతీ పుష్కరాలకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆదివారం హాజరుకానున్నారు.