హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ డీపీఆర్ అనుమతుల ప్రక్రియకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఇందుకోసం భూ సేకరణ చేపట్టవచ్చని, పనులను కూడా ప్రారంభించుకోవచ్చని తెలంగాణ సర్కారుకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సవరిస్తూ జస్టిస్ కేవీ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనకు రూట్ క్లియర్ అయ్యింది. మూడో టీఎంసీని చేర్చుతూ కాళేశ్వరం రివైజ్డ్ డీపీఆర్‌ను సమర్పిస్తే పరిశీలనకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ససేమిరా అన్నది. దీంతో తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ సందర్భంగా.. ‘నీళ్లు ఉన్నప్పుడు, ఆ మేరకు కేటాయింపులు ఉన్నప్పుడు ఎన్ని రోజుల్లో ఎత్తిపోసుకుంటే తప్పేమిటి? అందులో అభ్యంతరాలెందుకు?’ అని సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీని కోర్టు ప్రశ్నించింది. ఆ కారణంతో అనుమతుల ప్రక్రియను ఎలా నిలుపుదల చేస్తారని నిలదీసింది.
తక్కువ రోజుల్లో ఎత్తిపోసుకొనేందుకే..
కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. అందుకు సీడబ్ల్యూసీ నుంచి తెలంగాణ ప్రభుత్వం 2018లోనే అన్ని అనుమతులు పొందింది. దీంతో తొలుత 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోసుకొనేలా ప్రాజెక్టును ప్రభుత్వం డిజైన్ చేసింది. అయితే గోదావరిలో వరద రోజులు 90 నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనే అధ్యయనాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్కువ సమయంలోనే కేటాయించిన మేరకు 240 టీఎంసీల జలాలను ఎత్తిపోసేందుకు వీలుగా ప్రాజెక్టును తీర్చిదిద్దింది. 2 టీఎంసీలతో పాటు, అదనంగా మరో టీఎంసీని ఎత్తిపోసేలా ఏర్పాట్లు చేపట్టింది.
ఆయా నిర్మాణాలకు వీలుగా భూ సేకరణ చేపట్టింది. అయితే, ఈ అదనపు టీఎంసీ తరలింపునకు కేంద్రం కొత్త ప్రాజెక్టుగా పేర్కొంటూ రివర్ బోర్డు గెజిట్‌ను జారీ చేసింది. అందులో అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో మూడో టీఎంసీ పనులను చేర్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తదేమీ కాదని, అదనపు టీఎంసీ తరలింపునకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని, అనుమతులు లేని జాబితా నుంచి మూడో టీఎంసీని తొలగించాలని కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేశారు. అయినా, ఇప్పటికీ కేంద్రం అందుకు ససేమిరా అన్నది.
ఈ నేపథ్యంలో రివర్ బోర్డుల గెజిట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మూడో టీఎంసీని చేర్చుతూ కాళేశ్వరం రివైజ్డ్ డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకి, జీఆర్ఎంబీకి సమర్పించింది. అయితే సుప్రీం కోర్టు గతంలో విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను సాకుగా చూపుతూ ఆ డీపీఆర్ పరిశీలనకు జీఆర్ఎంబీ ససేమిరా అన్నది. దీంతో సర్కారు సుప్రీంలో సవాలు చేసింది. గతంలో విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను సవరించాలని, అనుమతులపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకొనేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.
తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, అయితే రాజకీయ కారణాలతోనే కాళేశ్వరం పనులకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. తెలంగాణ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు మూడో టీఎంసీ పనులపై గత స్టేటస్ కో ఉత్తర్వులను సవరించింది. మూడో టీఎంసీ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీని ఆదేశించింది. కోర్టు తీర్పుతో మూడో టీఎంసీ పనులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.