ధర్మారం/రామడుగు/బోయినపల్లి, ఆగస్టు 9: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి జలాశయం నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్‌హౌస్‌కు జలాలు చేరుతుండగా, శుక్రవారం ఒక మోటర్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిపోతున్నాయి. ఇక్కడ సైతం ఒకే మోటర్‌ను నడిపిస్తున్నారు. మొత్తం 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు ఎల్లంపల్లి నుంచి 12.75 టీఎంసీల జలాలు మధ్య మానేరుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ జలాశయంలో 27.54 టీఎంసీల నీటికి ప్రస్తుతం 17.15 టీఎంసీల నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
రంగనాయకసాగర్‌కు పరవళ్లు
మధ్యమానేరు నుంచి సిరిసిల్ల జిలా అన్నపూర్ణ ప్రాజెక్టుకు చేరుతున్న జలాలు రంగనాయకసాగర్వైపు పరుగెడుతున్నాయి. మధ్యమానేరు నుంచి అండర్ టన్నెళ్ల ద్వారా తిప్పాపూర్‌లోని సర్జ్పూల్కు జలాలు చేరుతుండగా, ఇక్కడ పంప్‌హౌస్‌లో రెండు మోటర్ల ద్వారా 6,440 క్యూసెక్కులు అన్నఫూర్ణ జలాశయానికి తరలిస్తున్నారు. ఇక్కడ జలాశయం గేట్లు తెరిచి అంతే మొత్తంలో రంగనాయకసాగర్‌కు వదులుతున్నారు. అన్నపూర్ణ జలాశయంలో 3.5 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రస్తుతం 1.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు తెలిపారు.
జలాశయాల్లో గోదావరి గలగలలు
సిద్దిపేట, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన జలాశయాల్లో గోదావరి జలాలు గలగలాపారుతున్నాయి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి జలాశయాలను నింపుతున్నది. ఈనెల 4 నుంచి ఎత్తిపోతలు ప్రారంభం కాగా, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు చేరుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ రిజర్వాయర్లు నిర్మించడం వల్లనే సాగు నీరు వస్తున్నదని రైతులు వరినాట్లు వేసే పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు.