హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ప్రాధాన్యంగా సాగునీటి అవసరాలు తీర్చడం.. ఫలితంగా పంటల దిగుబడులు పెరిగి రైతుల సంపద సృష్టి జరగాలన్నది ప్రధాన ఉద్దేశం. మలి ప్రాధాన్యంగా భూగర్భ జలాలు పెరిగి తాగునీటి అవసరాలు తీరడం. ఆ తర్వాత పరిశ్రమలకు నీటిని అమ్మడం, తాగునీటి సరఫరా ద్వారా వచ్చే సొమ్ముతో రెవెన్యూ పెంచడం మరో ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టును టూరిస్టు స్పాట్‌గా అభివృద్ధి చేసి మరోరకంగా ఆదాయాన్ని రాబట్టడం’ అని జస్టీస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అంతటికీ ఆదాయ వనరుగా మారిందని వివరించారు.
ఈ మేరకు ఆయన కాళేశ్వరం కమిషన్‌కు నివేదికను సమర్పించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లో జస్టీస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జరిగిన బహిరంగ విచారణకు రామకృష్ణరావు మంగళవారం హాజరయ్యారు. ఆయన సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా కమిషన్ విచారణ కొనసాగింది. కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులు తదితర అంశాలపై జస్టీస్ పీసీ ఘోష్ అడిగిన 24 ప్రశ్నలకు రామకృష్ణారావు బదులిచ్చారు. కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరేలా ప్రత్యేకమైన రెవెన్యూ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకోవాలని 2015 అక్టోబర్ 6న జీవో 145ను ప్రభుత్వం జారీ చేసిందని, దాని అర్థం ఏమిటని? అదేవిధంగా కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఆదాయం ఏమైనా వచ్చిందా? అన్న కమిషన్ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
పరిశ్రమలకు నీటిని సరఫరా చేయడం ద్వారా కార్పొరేషన్‌కు ఇప్పటివరకు రూ.7 కోట్ల మేర ఆదాయం సమకూరిందని రామకృష్ణారావు వివరించారు. వ్యవసాయానికి సాగునీరు అందించడం ద్వారా పంట దిగుబడులు పెరిగి రైతులకు ఆదాయం వస్తున్నదని చెప్పారు. జీవో 145 ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రుణాల ద్వారానే నిధులు సమకూర్చుకునేలా కార్పొరేషన్‌కు అవకాశం కల్పించారని, ప్రాజెక్టు పూర్తయి సొంత ఆదాయం సమకూరే వరకూ కార్పొరేషన్ నిర్వహణకు రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించి వినియోగించుకునేలా అవకాశం కల్పించారని తెలిపారు.
జీవో 145 మార్గదర్శకాలకు అనుగుణంగానే బరాజ్‌ల నిర్మాణం కొనసాగిందని రామకృష్ణారావు వివరించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, క్యాబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్టును చేపట్టారని, బ్యారేజీల నిర్మాణం, వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు చర్చించేలా కోర్ కమిటీని ఏర్పాటు చేశారని, ఫిసల్ పాలసీని అనుసరించి 3 బ్యారేజీలకు సంబంధించి ప్రతి స్టేట్మెంట్ను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిందని తెలిపారు. ప్రాజెక్టు కోసం ప్రభుత్వ గ్యారెంటీతోనే రుణాలను తీసుకున్నట్టు వివరించారు. కేఐపీసీఎల్ ప్రతి ఆర్థిక సంవత్సరానికి బ్యాలెన్స్ షీట్ మెయింటెన్ చేసిందా? అని కమిషన్ ప్రశ్నించగా, కార్పొరేషన్ ఆ డేటాను తయారు చేసిందని సమాధానమిచ్చారు. ప్రభుత్వమే రుణాలకు గ్యారెంటర్‌గా ఉన్నదని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ అసలు రూ.7,382 కోట్లు కాగా, వడ్డీ కింద మరో రూ.6,519 కోట్టను ప్రభుత్వం చెల్లిస్తున్నదని రామకృష్ణారావు తెలిపారు.