హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫారసు మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై అధ్యయనం చేసేందుకు వివిధ విభాగాల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. ఫీల్డ్ ఎక్స్‌పర్ట్‌గా, కన్వీనర్‌గా విశ్రాంత చీఫ్ ఇంజినీర్ కే శ్రీకాంత్, సివిల్ (స్ట్రక్చరల్) ఎక్స్‌పర్ట్‌గా జేఎన్టీయూ ఎమిరిటస్ ప్రొఫెసర్, నిట్ వరంగల్ విశ్రాంత ప్రొఫెసర్ సీబీ కామేశ్వర్రావు, మెకానికల్ ఎక్స్‌పర్ట్‌గా విశ్రాంత సీఈ కే సత్యనారాయణ, జియో టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌గా వరంగల్ నిట్ ప్రొఫెసర్ రమణమూర్తి, హైడ్రాలజీ, ప్లానింగ్ ఎక్స్‌పర్ట్‌గా ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ టీ శశిధర్‌ను ప్రతిపాదించింది.
వారితో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్‌శాఖ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే ఇరిగేషన్‌శాఖ ప్రతిపాదించిన నిపుణుల కమిటీపై సీనియర్ ఇంజినీర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కమిషన్ సూచనలకు భిన్నంగా కమిటీలో మెంబర్లను ప్రతిపాదించారని ఆరోపిస్తున్నారు.
జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ప్రముఖ సంస్థలకు చెందిన విషయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలని కమిషన్ సూచిస్తే, అందుకు భిన్నంగా గతంలో విధులు నిర్వర్తించిన ఇంజినీర్లనే ప్రతిపాదించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా కన్వీనర్‌గా, ఫీల్డ్ ఎక్స్‌పర్ట్‌గా విశ్రాంత ఇంజినీర్ కే శ్రీకాంత్ పేరును ఏ ప్రమాణాల ఆధారంగా ప్రతిపాదించారో తెలియడం లేదని ఇంజినీర్లు విమర్శిస్తున్నారు.
సదరు ఇంజినీర్ ఎస్ఈగా ఉన్న సమయంలోనే మిడ్‌మానేరు కరకట్టలు కుంగిపోయాయని ఉదహరిస్తున్నారు. అదేవిధంగా ఏసీబీ అధికారులకు చిక్కిన విషయాన్ని సీనియర్ ఇంజినీర్లు గుర్తుచేస్తున్నారు. ఇది నిపుణుల కమిటీ కాదని, ఈఎన్సీ అనిల్‌కుమార్ వ్యక్తిగత కమిటీలా ఉందని సీనియర్ ఇంజినీర్లు నిర్వచిస్తుండడం ఇప్పుడు డిపార్ట్మెంట్లో చర్చనీయాంశంగా మారింది.