కాళేశ్వర నిర్మాణం నవజీవన దృశ్యాన్ని కనుల ముందు సాక్షాత్కరింపజేసింది. వ్యవసాయరంగంతో పాటు అనేక రంగాలను బతికించింది. బహుముఖేనా అభివృద్ధికి కారణ మైంది. తాగు, సాగు నీటి అవసరాలను తీర్చడంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమలకు పునరుజ్జీవం పోసింది. పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతమిచ్చి, రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చింది. సమైక్యపాలనలో పడావు పడ్డ ప్రాజెక్టులకు జలకళను తెచ్చి, బీడు భూముల్లో పచ్చదనం నింపింది.
నాటి కరువునేలను ముద్దాడిన కాళేశ్వరగంగ జలపరవళ్లతో తెలంగాణ సస్యశ్యామలమైంది. జీవవైవిధ్యం, పాడిపంట లతో బతుకుచిత్రం మార్చింది. వలస బతుకులను మళ్లీ పల్లెబాట పట్టించింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు సరికొత్త రూపమిచ్చింది. అందుకే ‘కాళేశ్వరం’ ఓ అద్భుత సాహసం, ఇంజినీరింగ్ ప్రతిభకు చిహ్నమని ప్రపంచమంతా కొనియాడింది అంటూ స్టేట్ బ్యూరో ప్రతినిధి మ్యాకం రవికుమార్ రాసిన ప్రత్యేక కథనం.
(మ్యాకం రవికుమార్)
హైదరాబాద్, జూన్ 20 (నమస్తేతెలంగాణ): సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ జల ప్రదాయినిగా నిలుస్తున్నది. నవజీవనానికి బాటలు పరుస్తున్నది. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చి వేస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానంలోనూ, నిర్మాణ కౌశలంలోనూ, బహుముఖ ప్రయోజనాలను అందిస్తూ ప్రపంచానికే తలమానికంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు ఇప్పుడు తెలంగాణకు అందుతున్నాయి. మొత్తంగా ప్రాజెక్టు కింద ఉన్న 13 జిల్లాల రూపురేఖలు మారిపోతున్నాయి. రెండుపంటలకు భరోసా లభించగా, కొత్తగా ఆయకట్టు అభివృద్ధి చెందుతున్నది. గడిచిన కొన్నేండ్లుగా పంటల దిగుబడి ఆయా జిల్లాల్లో గణనీయంగా పెరగడమే అందుకు నిదర్శనం. ప్రతీఇంట ధాన్యం సిరులు తొణికిసలాడటంతో రైతన్న ఆదాయం పెరిగింది. వలసలు ఆగిపోయాయి. అదేవిధంగా ప్రాజెక్టు కింద ఉన్న జిల్లాల్లో భూగర్భజలాల మట్టం కూడా రికార్డుస్థాయిలో పెరిగింది. మత్స్యసంపద ఎంతో అభివృద్ధి చెందింది. నీటి వనరుల గణనీయ వృద్ధితో ఆయా జిల్లాల్లో పర్యావరణ సమతుల్యత నెలకొంటుండడంతో పాటు విదేశీపక్షులు, జంతుజాలం వచ్చిచేరుతున్నది. అలా తెలంగాణ గడ్డ జీవవైవిధ్య నిలయంగా మారుతున్నది.
ఉమ్మడి ఏపీలో గోదావరిపై నిర్మాణం జరిగిన ఒకే ఒక్క భారీ ప్రాజెక్టు ఇది. 1964లో ప్రాజెక్టు పనులు మొదలుపెడితే రెండు దశాబ్దాలపాటు కొనసాగాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి నీటి విడుదల ప్రారంభించేనాటికే ప్రధాన జలాశయం సామర్థ్యం 12 టీఎంసీలు తగ్గింది. కాల్వలన్నీ పూర్తయ్యేసరికి మరో పది టీఎంసీల సామర్థ్యం తగ్గింది. అప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో దిద్దుబాటుకు ఏవైనా చర్యలు చేపట్టారా? అంటే అదీ లేదు. పైగా ఆయకట్టుకే దిక్కులేని ఎస్సారెస్పీని ఆధారంగా చేసుకుని ఎస్సారెస్పీ స్టేజీ 2 చేపట్టారు. పూర్తైన కాలువలు సైతం నీళ్లు ఇవ్వకుండానే శిథిలావస్థకు చేరుకున్న దుస్థితి. అయితే రాష్ట్ర ఏర్పాటు తరువాత ఎస్సారెస్పీకి కేసీఆర్ కొత్తజీవాన్ని అద్దారు. మిడ్‌మానేరు, వరద కాలువ పెండింగ్ పనులను పూర్తిచేశారు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీని అనుసంధానించారు. వరద కాలువను రిజర్వాయర్‌గా తీర్చిదిద్దారు. అటు ఎస్సారెస్పీకి ఎత్తిపోసుకునే ఏర్పాట్లు చేశారు. ఇటు వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ కాకతీయ కెనాల్‌కు ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు జలాలను అందించేందుకు లింక్ కెనాల్‌లను ఏర్పాటు చేశారు. వెరసి ఎస్సారెస్పీ ప్రాజెక్టు చరిత్రలోనే సువర్ణాధ్యాయం మొదలైనట్లయింది. కాళేశ్వరంతో శ్రీరాంసాగర్‌పై భారం గణనీయంగా తగ్గింది. లోయర్‌మానేరు డ్యామ్ ఎగువన ఉన్న ఆయకట్టుతో పాటు జలాశయం మీద ఆధారపడిన లక్ష్మీ, సరస్వతి కాల్వలు, లిఫ్టు పథకాలకు జలాశయం నుంచి నీటిని అందించారు. ఎల్ఎండీ దిగువన ఉన్న 9.68లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు కాళేశ్వర జలాల్ని అందించారు. అందుకే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెళ్ల పాటు కాకతీయ కాల్వలో ఆరు వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది.
ఉమ్మడి పాలనలో గోదావరి బేసిన్లో కొన్ని ప్రాంతాలకే రిజర్వాయర్లు పరిమితమయ్యాయి. కానీ కేసీఆర్ అందుకు భిన్నంగా రాష్ట్రంలోని నలుమూలలా రిజర్వాయర్లను విస్తరించారు. నదులు, ఉపనదుల మీదనే కాకుండా ఆఫ్‌లైన్ రిజర్వాయర్లకూ ప్రాధాన్యతనిచ్చారు. కాళేశ్వరంలో భాగంగా రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్ ఇలా చెప్పుకుంటూ అనేక రిజర్వాయర్లను నిర్మించారు. ఇవిగాకుండా మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత చేపట్టి, చెక్‌డ్యామ్‌ల ద్వారా కూడా రాష్ట్రంలో నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా పచ్చదనం పెరిగి మత్స్య, పాడిపరిశ్రమ, గొర్రెల పెంపకం తదితర రంగాలకూ ఊతమిస్తూ ఉపాధిబాటలు పరుస్తుండడం విశేషం. రిజర్వాయర్లకు తోడు ఉచిత చేపల పంపిణీ కార్యక్రమం మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మరింత ఊతమిచ్చింది. భారీ రిజర్వాయర్లు అందుబాటులోకి రావడంతో అవి టూరిస్ట్ డిస్టినేషన్‌గా కూడా మారుతున్నాయి. రంగనాయకసాగర్, మల్లన్నసాగర్లే ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో నీటి నిల్వ సామర్థ్యం ఇప్పటికే 141టీఎంసీలకు పైగా పెరిగింది. ఇదిగాకుండా వాగులన్నింటిపైనా చెక్‌డ్యామ్‌లను నిర్మిస్తున్నారు. ఇలా మొత్తంగా ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు రాడార్లోనే 500టీఎంసీలకు పైగా నీరు నిల్వచేసుకునే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
నీటి వనరులున్న చోటనే జీవజాతులు ఆవాసాలను ఏర్పరచుకోవడం సహజమే. కాళేశ్వరం ప్రాజెక్టు.. రాష్ట్ర సహజ జీవావరణ వ్యవస్థలోనూ గణనీయమైన మార్పును తీసుకువస్తున్నది. పచ్చదనానికి ఊపిరిపోస్తున్నది. జీవవైవిధ్యతను పెంపొందిస్తున్నది. తత్ఫలితంగా రాష్టం ఎల్లలు దాటిన దశాబ్దాల కిందటి వలసపక్షులు సొంతగూటికి చేరుతున్నాయి. మానేరులో కనువిందు చేస్తున్నాయి. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టుకు మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు వలసవస్తున్నాయి. పోచారం అభయారణ్యంలో కృష్ణజింకలు ఏళ్ల తర్వాత దర్శనమిచ్చాయి. దాదాపు 17 ఏండ్ల అనంతరం భూపాలపల్లి ప్రాంతంలో పెద్దపిల్లులు సందడి చేస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం 16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించింది. తద్వారా పరిశ్రమల నుంచి ఏటా రూ.4530.56 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. ఎన్టీపీసీ, రామగుండం ఎరువుల కార్మాగారం నుంచి ఇప్పుడు నీటి సరఫరా రుసుము నేరుగా కార్పొరేషన్ ఖాతాలోకి వస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభమైనాక ఎన్టీపీసీ ద్వారా పొందిన రుసుం రూ.72 కోట్లు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి అందిన నీటి రుసుం రూ.3.25 కోట్లు. కాళేశ్వరం జలాల ఫలితంగానే సిద్ధిపేట జిల్లా ములుగులో కోకాకోలా కంపెనీ ఏర్పాటయింది. జీనోమ్‌వ్యాలీకి కూడా నీటి సరఫరా జరుగుతున్నది.