గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు.. తెలంగాణలో 765 కి.మీ. ఈ ప్రస్థానంలో గోదావరికి ఊపిరిపోసే కీలకమైన ఉపనదులు అనేకం ఉన్నాయి. గోదావరి నది రికార్డులను తిరగేస్తే ఏటా 3-4 వేల టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయనేది నగ్న సత్యం. అందులోనూ ప్రాణహిత భాగస్వామ్యమే సరాసరి 36 శాతం! అంటే 1000-1400 టీఎంసీలు అన్నమాట! ఇంద్రావతి కలిస్తే ఇది 2000-2500 టీఎంసీల వరకు ఉంటుంది.
Kaleshwaram | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఆ రెండు ప్రధాన ఉపనదులు తెలంగాణ పరిధిలోనే ప్రధాన గోదావరిలో కలుస్తాయి. పెద్దపెద్ద ఇంజినీర్లు అవసరం లేదు. చిన్న పిల్లాన్ని అడిగినా ఆ రెండు ప్రధాన ఉపనదులు కలిసిన తర్వాత ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ బీడు భూములను గోదారమ్మ పావనం చేస్తుందనే సత్యాన్ని చెప్తాడు. కానీ ఆరు దశాబ్దాలుగా జరిగిన తతంగం అందుకు భిన్నం! ఏలికలెవరైనా ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహం ఒక్కటే! ఎక్కడా చిన్న ఆటంకం లేకుండా, ఒక చుక్క గోదావరి కూడా తెలంగాణ గడ్డ మీద నిలబడకుండా ధవళేశ్వరం దాకా పరుగులు తీయాలనే కుతంత్రం ఇందులో దాగి ఉన్నది. ఉమ్మడి ఏపీ ఏర్పడేనాటికి ఒప్పందాలు పూర్తయి అంతర్రాష్ట్ర సమస్యలు కూడా పెద్దగా లేని తెలంగాణ చారిత్రక ప్రాజెక్టుల గొంతు నులిమారు. 350 టీఎంసీల వినియోగానికి రూపకల్పన చేసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును 112 టీఎంసీలకు కుదించి ఎందుకూ కొరగాకుండా చేశారు.
300 టీఎంసీల వినియోగానికి ప్రతిపాదించిన ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు, దానికి అదనంగా 100 టీఎంసీలతో ప్రతిపాదించిన కాంతనపల్లి ప్రాజెక్టుకు పాతరేశారు. పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి బేసిన్లను వదిలి నీరు లభించని ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించారు. ఉమ్మడి పాలకులు గోదావరిపై రూపొందించిన తెలంగాణ ప్రాజెక్టులన్నీ అప్పర్ గోదావరి (జీ1), (జీ2), ప్రవర (జీ3), మంజీరా (జీ4), మధ్యగోదావరి (జీ5), మానేరు (జీ6)పై ఆధారం చేసుకున్నవే కావడం అందుకు నిదర్శనం. ఎగువ నుంచి వరద తక్కువైందని తెలిసినా శ్రీరాంసాగర్‌ను ఆధారం చేసుకొని వరద కాల్వ.. దాని దిగువన ప్రధాన గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టు, కడెంపై మరో ప్రాజెక్టు.. గుత్ప, అలీసాగర్ వంటి ప్రాజెక్టులు, నీరులేని గోదావరి ఉపనది మానేరుపై మధ్యమానేరు, దిగువ మానేరు ప్రాజెక్టులు నిర్మించారు. అవన్నీ ఒకెత్తయితే మంజీరాపై అప్పటికే ఉన్న నిజాంసాగర్‌కు నిలువునా ఉరేసినట్టుగా సింగూరు ప్రాజెక్టు, పైగా దాన్ని హైదరాబాద్ తాగునీటి కోసమే కేటాయించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో సుదీర్ఘ కాలయాపన, ఎగువ రాష్ర్టాలు ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడం, మన వద్ద నీటినిల్వ సామర్థ్యం పడిపోవడం వెరసి వేలకోట్లు వెచ్చించి నిర్మించిన ఆయా ప్రాజెక్టులతో తెలంగాణకు దక్కిన ఫలితం శూన్యం! అయినా కాగితాలపైనే ఆయకట్టును చూపుతూ ఏళ్లుగా తెలంగాణను కనికట్టు చేస్తూ కట్టిపడేశారు.
వాటి పూడికతీయలేం. తీద్దామన్నా వేలకోట్ల ఖర్చు! ఇక కొత్తగా ఆ స్థాయిలో ప్రాజెక్టులు నిర్మించడమూ అసాధ్యం. కారణం ఇప్పుడు అన్ని రాష్ర్టాల వినియోగం పెరగడంతో పాటు అవగాహన, అవసరాలు పెరిగి ప్రాజెక్టులూ పెరిగాయి. పొరుగు రాష్ర్టాల అభ్యంతరాలు పెరిగాయి. దానికి తోడు జనావాసాలు పెరిగి ముంపు అనేది కూడా పెద్ద సమస్యగా మారింది. ఇలా ఉమ్మడి పాలకులు సృష్టించిన శతకోటి సమస్యలకు పరిష్కారంగా కేసీఆర్ ఆవిష్కరించిన అద్భుతమే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం! అన్ని పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు భరోసానివ్వడమేగాక కొత్త ఆయకట్టుకు పురుడుపోసింది. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే గోదావరిలో మన 968 టీఎంసీల్లో 750 టీఎంసీలకు పైగా వినియోగించుకునే మార్గం సుగమమైంది. ఎగువ నుంచి వరద వచ్చినా, రాకున్నా ఎల్లంపల్లికి ఢోకా లేకుండా పోయింది. దైవాదీనంగా మానేరుపై నిర్మించిన ఎగువ, మధ్య, దిగువ మానేరుకు కాళేశ్వర గంగ శాశ్వత భరోసా కల్పించింది. మంజీరా మొహం చాటేసినా, సింగూరుకు కాళేశ్వరం ఊపిరిలూదింది. ఆయకట్టుకు మోక్షం లభించింది. అదే రీతిన హల్దీ వాగుద్వారా చారిత్రక నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాలతో ప్రాణం పోస్తున్నది. అందుకు నేడు గత ప్రాజెక్టుల కింద సాగవుతున్న ఆయకట్టు, వస్తున్న పంటల ఉత్పత్తే సజీవ సాక్ష్యమైంది. అందుకే కాళేశ్వరం తెలంగాణ జీవనరేఖలా నిలిచింది!
గోదావరి సబ్ బేసిన్ల వారీగా నీటి లభ్యత శాతాల్లో..
జీ1 (అప్పర్ గోదావరి) ; 7.90
జీ2 (ప్రవర) ; 1.10
జీ3 (పూర్ణ) ; 1.89
జీ4 (మంజీర) ; 4.3
జీ5 (మధ్య గోదావరి) ; 5.90
జీ6 (మానేరు) ; 1.38
జీ7 (పెన్‌గంగ) ; 4.21
జీ8 (వార్దా) 5.27
జీ9 (ప్రాణహిత) ; 25.96
జీ10 (లోయర్ గోదావరి) ; 7.19
జీ11 (ఇంద్రావతి) ; 22.93
జీ12 (శబరి) ; 12.24
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపగలిగే జలాశయాలు.. ఆయకట్టు