హైదరాబాద్, ఫిబ్రవరి24 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణను 27 నుంచి పున:ప్రారంభించనున్నది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, సీసీ డిజైన్లు, ఓఅండ్ఎం ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులు సమర్పించిన అఫిడవిట్లపై బహిరంగ విచారణ పూర్తిచేసింది.
క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజినీర్లు, ఇరిగేషన్శాఖకు సంబంధించి పూర్వ, ప్రస్తుత సెక్రటరీలు, కమిషన్ ఎదుట అఫిడవిట్లు దాఖలు చేసిన రిటైర్డ్ ఇంజినీర్లు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలను సైతం విచారించింది. విచారణ తుది దశకు చేరగా, మరోసారి 27 నుంచి ఇంజినీర్లు, సీడీవో విశ్రాంత సీఈ నరేందర్రెడ్డి, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం తదితరులను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం కమిషన్ గడువును ఇటీవలనే 2 నెలలకు పొడిగించింది.