హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిషన్ గడువును ప్రభుత్వం మరో నెల పొడిగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో లోపాలపై విచారణ కోసం ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో కమిషన్‌ను నియమించింది. 100 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఆ తర్వాత క్రమంగా కమిషన్ గడువును పొడిగిస్తూ వస్తున్నది. నేటితో తుది గడువు ముగియనుండగా నివేదిక సిద్ధం కాకపోవడంతో గడువును మే 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ ఇప్పటికే ఆయా బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. ప్రస్తుతం విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను అధ్యయనం చేస్తుండడంతోపాటు మరికొంతమందిని విచారించి మే రెండో వారానికి నివేదిక అందించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
కాంట్రాక్టు పద్ధతిన సీఈ బాధ్యతలు ; ఇరిగేషన్ మంత్రి ఓఎస్డీగా భీంప్రసాద్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ చీఫ్ ఇంజినీర్ పోస్టును ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసింది. నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ సర్కిల్-1 ఎస్ఈగా విధులు నిర్వహించి మార్చి 31న ఉద్యోగ విరమణ పొందిన విజయ్‌భాస్కర్‌రెడ్డిని సీఈగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్టు వెల్లడించింది. ఇక ఇరిగేషన్‌శాఖ మంత్రి ఓఎస్డీగా విశ్రాంత ఎస్ఈ భీంప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. ఆయన అడిషనల్ సెక్రటరీగా కొనసాగారు. అయితే, ఉద్యోగ విరమణ పొందిన వారిని కొనసాగించేది లేదని ప్రగల్భాలు పలికిన రేవంత్‌రెడ్డి సర్కారు.. తమ అనుయాయులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే 17 సీఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. రెగ్యులర్ ఇంజినీర్లకు ప్రమోషన్లు కల్పించకుండా ఏడాదిగా కాలయాపన చేస్తున్నది. ఒక్కో ఇంజినీర్‌కు రెండేసి చొప్పున అదనపు బాధ్యతలు అప్పగిస్తూ చోద్యం చూస్తున్నది. దీనిపై డిపార్ట్మెంట్ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.