హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ తపన, దూరదృష్టితో ఓరుగల్లులో రూపుదిద్ద్దుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఉజ్వల ప్రగతికి తార్కాణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజంజాహీ మిల్లు ద్వారా పది వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమ మాత్రమే కాదు.. వరంగల్, హనుమకొండ జంట పట్టణాలకు విద్యుత్తు వెలుగులను ప్రసాదించి, ప్రగతిపూలగంధాలను వెదజల్లిన నెలవని ఆదివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు.
అయితే ఈ మిల్లు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యానికి మూతపడిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని, తెలంగాణ బిడ్డలకు కొలువులు దక్కాలనే కేసీఆర్ తపనతో కాకతీయ టెక్స్టైల్స్ పార్క్‌కు అంకురార్పణ చేశారని చెప్పారు. నేడు వేలాది యువతకు ఉపాధి కల్పించడం సంతోషకరమన్నా రు. ప్రస్తుతం గణేశా.. ఎకోస్పీయర్, యంగ్వన్, కిటెక్స్ సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పాయని, భవిష్యత్తులో మరిన్ని సంస్థలు కొలువుదీరాలని ఆకాంక్షించారు.