హనుమకొండ, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి తొండిమాటలు మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నాడనేది అసెంబ్లీ స్పీకర్ చెబుతారని పేర్కొన్నారు. కడియం శ్రీహరి శుక్రవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాన అంశంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పారు. మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు డైరెక్షన్ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ స్పీకర్ నుంచి నోటీసు వచ్చిందని, సమాధానం ఇచ్చేందుకు ఇంకా గడువు ఉన్నదని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని అన్నారు. టీడీపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన కడియం ఫిరాయింపులను సమర్థించనని చెప్పడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.