స్టేషన్ ఘన్పూర్, జూలై 8 : ‘అధికారులు నా దగ్గరికి వస్తే సమీక్ష అంటారు.. నేను అధికారుల దగ్గరికి వెళ్తే అనరు.. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా కొందరు మాట్లాడుతున్నారు’ అని మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా విమర్శించారు. బుధవారం కడియం శ్రీహరి జన్మదినం సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేవాదాయశాఖ కమిషనర్‌తో తాను సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలనడం సరైంది కాదన్నారు. ప్రొటోకాల్‌కు లోబడే నియోజకవర్గంలోని ఆలయాల గురించి మాట్లాడేందుకు దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిశానని వివరించారు. తప్పు చేయనప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
అభివృద్ధి గురించి ఆలోచించని, ప్రజల మధ్యలో ఉండనివారు కాంట్రవర్సీలు సృష్టించి వార్తల్లో ఉండాలని చూస్తారని విమర్శించారు. వివాదాలపై కాకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న దేవాదులపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎంజీఎం దవాఖానలో వైద్య సిబ్బంది నియామకం, సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టెండర్లు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు.