Kadiyam Srihari | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఇన్నాళ్లూ చేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని స్వయంగా ఆ పార్టీ ప్రభుత్వంలోని మంత్రుల బృందమే ఒప్పుకొన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం మేడిగడ్డ బరాజ్ వద్దకు వెళ్లి కాళేశ్వరం సాక్షిగా ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు వివరించారని చెప్పారు. ఇందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. శ్వేతపత్రాల విడుదల, జ్యుడీషియల్ విచారణ, ప్రాజెక్టుల సందర్శన పేరిట ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి అనేక బహిరంగసభల్లో చేసిన ఆరోపణలన్నీ హంబక్ అని తేలిపోయిందని కడియం శ్రీహరి అన్నారు. మంత్రులు శుక్రవారం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో కాళేశ్వరంకు రూ.93 వేల కోట్లు ఖర్చయ్యిందని చెప్పారని, రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే 98 వేల ఎకరాల కొత్త ఆయకట్టు పెరిగిందని, 16 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని పీపీటీలో ప్రభుత్వమే అంగీకరించిందని అన్నారు. వీటిని బట్టి కాంగ్రెస్ ఆరోపణలన్నీ అబద్ధమని తేలిపోయిందని పేర్కొన్నారు.
తుమ్మిడిహట్టి దగ్గరే తాము ప్రాజెక్టును నిర్మిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుడు మాట మాట్లాడారని కడియం విమర్శించారు. అదీ ఎత్తిపోతల ప్రాజెక్టేనని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా కాదనే విషయాన్ని ఉత్తమ్ తెలుసుకుంటే మంచిందని సూచించారు. దానికీ విద్యుత్తు అవసరం ఉంటుందని అన్నారు. ‘తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 160 టీఎంసీల నీటి లభ్యత ఉండదని, ఆ ప్రాజెక్టు విజయవంతం కాదని కేంద్ర జలవనరుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి 2015లోనే లేఖ రాసింది. అన్నివైపుల నుంచి అసమ్మతులు ఉన్నా నాటి సీఎం వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది నిజం కాదా? 2008 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రతోపాటు కేంద్రంలోనూ కాంగ్రెసే అధికారంలో ఉన్నది. ప్రస్తు తం మంత్రులుగా ఉన్నవారు కొంతమంది ఆనాడూ మంత్రులుగా ఉన్నారు. కనీసం కేంద్రజల సంఘం నుంచి అనుమతులు తెచ్చుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాదా?’ అని ప్రశ్నించారు.
మంత్రులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు మాత్రమే ఖర్చయ్యిందని చెప్పారు. మరి రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలి.
నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్తగా ఈపీసీ (ఎస్టిమేట్ ప్రొక్యూర్ అండ్ కన్స్ట్రక్షన్) విధానాన్ని తెచ్చి, దేశంలో ఎక్కడలేని విధంగా మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చిందని కడియం మండిపడ్డారు. ఉత్తర్వుల్లో 0.5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇస్తామని చె ప్పి.. 2 నుంచి 2.5 శాతం ఇచ్చారని ధ్వజమెత్తారు. మొబిలైజేషన్ కోసమే దాదాపు రూ.651 కోట్లు ఖర్చుచేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహట్టిపై 6,116 కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. ‘కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని తెలుసుకున్న తరువాత నీటి లభ్యత ఉన్నచోట కొత్తగా ప్రాజెక్టు నిర్మించుకోవాలనే తలంపుతోనే కాళేశ్వరానికి రూపల్పన చేశారు. 248 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు 13 జిల్లా లు, 31 నియోజకవర్గాలు, 121 మండలాలు, 1,698 గ్రామాల్లో నీటి వినియోగం, 19 లక్షల 63 ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల స్థిరీకరణతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. నిర్మాణానికి అవసరమైన సీడబ్ల్యూసీ, హైడ్రాలజీ, అంతరాష్ట్ర ఒప్పందాలు, ఇరిగేషన్ ప్లానింగ్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్, అటవీ, పర్యావరణ సహా 11 రకాల అనుమతులను తీసుకొచ్చింది. అన్ని అనుమతులు ఇచ్చాకే నిర్మాణ పనులు ప్రారంభిం చాం.141 టీఎంసీల నీటిని నిల్వచేసే అనేక జలాశయాలు, 3 బరాజ్‌లు, అనేక ఎత్తిపోతల వల్ల విద్యు త్తు వినియోగం అవసరమైన నేపథ్యంలో తుమ్మిడిహట్టి కన్నా కాళేశ్వరానికి వ్యయం పెరిగింది’ అని వివరించారు.
మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంపై జ్యుడీషియల్ విచారణకు తామే డిమాండ్ చేశామని కడియం గుర్తుచేశారు. విచారణ కమిటీ వేయకుండానే ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులే అవినీతి జరిగిందని తీర్పులిచ్చేస్తే ఆ తరువాత విచారణ ఎలా జరుగుతుందో? దాని తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోగలమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 2016లో కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ నాయకత్వంలో ప్రధానిని కలిసిన మంత్రుల బృందంలో ఉప ముఖ్యమంత్రిగా తానూ ఉన్నానని గుర్తుచేశారు. 1954లో నాగార్జునసాగర్ ప్రాజెక్టును రూ.122 కోట్ల అంచనాతో మొదలుపెడితే పూర్తి అయ్యేనాటికి 1,200 కోట్లకు చేరిందని తెలిపారు. శ్రీరాంసాగర్‌ను 1964లో 40 కోట్లతో ప్రతిపాదిస్తే, పూర్తి కావటానికి 4,300 కోట్లకు చేరిందని చెప్పారు.
మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం వెనుక నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ చేయాలని బీఆర్ఎస్ పార్టీయే మొదట డిమాండ్ చేసింది. బరాజ్ సాంకేతిక కారణాలతో కుంగిపోయిందా? మరో కారణంతో కుంగిపోయిందా? అనే విషయం విచారణలో తప్పకుండా బయటికి వస్తుంది. కానీ, ఒకవైపు విచారణ చేపడతామని చెప్పి, మరోవైపు ఆ విచారణను ప్రభావితం చేసేలా మంత్రులే మాట్లాడుతున్నారు.
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం వల్ల రెండు పంటలు సమృద్ధిగా పండాయని, పంటల విస్తీర్ణం పెరిగిందని కడియం శ్రీహరి తెలిపారు. 2014-15లో 1.31 కోట్ల ఎకరాల పంటల విస్తీర్ణం ఉంటే, 2022-23 నాటికి 2.8 కోట్ల ఎకరాలకు చేరిందని చెప్పారు. 2013-14లో పంటల దిగుబడి కోటి 7 లక్షల 49 వేల టన్నులుంటే, 2022-23 నాటికి 4 కోట్ల 65 లక్షల టన్నులకు పెరిగిందని గుర్తుచేశారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకునే విషయాన్ని పక్కనబెట్టి కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లే పని మొదలుపెట్టిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిసహా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రతీ పథకానికి తేదీలు ప్రకటించారని, అందుకు అనుగుణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 412 హామీలను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అవినీతికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని ఆరోపించారు. దేశంలో అవినీతిని పెంచి పోషించిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు.
సచివాలయంలో లంకెబిందెలున్నాయని వచ్చారా? అని కడియం శ్రీహరి పరోక్షంగా సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘రాత్రి పూట లంకె బిందెలు కావాలని గుట్టలెంబడి, చెట్లెంబడి, పుట్టలెంబడి ఎవరు పోతరు? సెక్రటేరియట్లో లంకెబిందెలుంటాయా? పైసలు ఉంటాయా? రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ, వ్యయాలు తెలియకుండానే ప్రజలకు అలవికాని హమీలిచ్చారా? తెలంగాణ పదేండ్ల బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకొని పరిశీలించకుండానే గుడ్డిగా ప్రజలకు హామీలిచ్చారా?’ అని ప్రశ్నించారు.
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతోనే సీఎం కాన్వాయ్ కోసం 22 ల్యాండ్‌క్రూజర్ కార్లను కొనుగోలు చేస్తారనే విషయాన్ని విస్మరించి సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వాటిపై వ్యాఖ్యానించటం సరికాదని కడియం శ్రీహరి సూచించారు. ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఆ వాహనాలు కచ్చితంగా ప్రజల ఆస్తి అన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ చేస్తానని ఒకరు, దవాఖానగా మారుస్తామని మరొకరు చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు? అందులో ఇప్పుడెవరుంటున్నారు? అలాగే ల్యాండ్ క్రూజర్లలో ఎవరు తిరుగుతారో చూడమా? వాటిని అమ్మేస్తరా? వాటిని కొనుగోలు చేయకముందే కొన్నట్టు చూపించారా? ప్రగతిభవన్‌పై అంతలేసి మాటలు అన్నవాళ్లు ఇప్పుడేముఖం పెట్టుకొని ఉంటున్నారు’ అని ప్రశ్నించారు