జనగామ, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : పోరాడి సాధించుకున్న జనగామ జిల్లా రద్దుకు స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడియం మొదటి నుంచి జనగామ జిల్లాను వ్యతిరేకించారని, తాము అధికారంలోకి వస్తే జిల్లాకు పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టారని గుర్తుచేశారు.
జేఏసీ ఏర్పాటుచేసుకొని కష్టపడి జిల్లాను సాధించుకుంటే అక్కడ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలను కుదిస్తున్నామని చెబుతున్నాడని, ఇక్కడ జనగామ, హనుమకొండ జిల్లాలు వద్దని కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి అంటున్నారని పేర్కొన్నారు. పాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ కోసం అప్పటి సీఎం కేసీఆర్ దూరదృష్టితో జనగామ జిల్లాతోపాటు కలెక్టరేట్, మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసినట్టు గుర్తుచేశారు. ‘జనగామ జిల్లాను మూసేస్తే మీ ప్రభుత్వం, మీ పార్టీ మూతపడుతది. పోరాటాలతో తెచ్చుకున్న జిల్లాను ఎవరు ముట్టుకున్నా.. ఆ అగ్నిలో కాలిపోతరు. జనగామ జిల్లా ప్రజలతో ఆడుకోవద్దు’ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.