దండేపల్లి, మార్చి 8 : కడెం ఆయకట్టు చివరి వరకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం మలుపు వద్ద శనివారం నాగసముద్రం, మాకులపేట, తాళ్లపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. సాగు నీళ్లు అందక పంటలు ఎండిపోతే తమకు పురుగుల మందే దిక్కవుతుందని వాపోయారు. ఇరిగేషన్ ఎస్ఈ, డీఈలు రైతులతో ఫోన్లో మాట్లాడి నీళ్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆకేరు రైతు అష్టకష్టాలు
పంట కండ్ల ముందే ఎండిపోతుండటంతో ఆ రైతు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ పదేండ్ల పాలనలో జీవనదిలా పారిన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలోని ఆకేరు వాగు నేడు చుక్క నీరులేక వెలవెలబోతున్నది. వరి పంట కండ్లముందే నెర్రెలు బట్టి ఎండిపోతున్నది. దానిని కాపాడుకునేందుకు ఏటిలో చెలిమెలు తీసి మోటర్లతో నీటిని పారించేందుకు రైతు అష్టకష్టాలు పడుతున్నారు. -చిన్నగూడూరు
భూత్పూర్ కాల్వలో తేలిన మోటర్లు
నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలో భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాకపోవడంతో కాల్వలో తేలుతున్న మోటర్లు. నీళ్లు లేకపోవడంతో ఈ రిజర్వాయర్ పరిధిలోని పంటలు ఎండిపోతున్నాయి. అప్పు తెచ్చి పంట సాగు చేశామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అయిలన్నా.. నీళ్లిస్తవని నమ్మి నాటేసినం
‘అయ్యా.. ఎమ్మెల్యే అయిలన్నా.. నీళ్లిస్తవని నిన్ను నమ్మి నాటేసినం. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టినం. నీళ్లు ఇయ్యక పోతివి. బోర్లేమో పొయ్యకపాయె. వేసినకాడికి పంటంతా ఎండిపోయి తెర్లయినం’ అని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం వారు ఎండిన పొలంలోకి దిగి నిరసన తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యను నమ్మి సాగు చేశామని చెప్పారు. ‘పొలం ఎండిపోవడంతో గత్యంతరం లేక బర్లు, గొర్లను మేపుతున్నం.. అయ్యా.. ఎమ్మెల్యేగారూ నీ కాల్మొక్తం.. దండం పెట్టి వేడుకుంటున్నం. మమ్మల్ని ఆదుకోండి’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. -రాజాపేట
నీళ్లు లేవాయె.. పంట ఎండిపాయె..
సాగునీళ్లు లేకపోవడంతో మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలంలో ఎండిపోయిన వరి పంటను చూపుతున్న రైతు
కాల్వ పారకపాయె.. వరి ఎండిపాయె..
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొల్లపల్లి శివారులో ఎండిన వరి పంట. సంగంబండ రిజర్వాయర్ నుంచి కాలువలో నీళ్లు పారకపోవడం వల్ల పంట ఎండిపోయిందని చెప్పిన రైతు వెంకట్ రెడ్డి
నీళ్లులేక పశువుల మేతకు..
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కిష్టంపల్లి గేటు తండా శివారులో రైతు చెన్నయ్య రెండెకరాల్లో వరి పంట వేశాడు. పొట్ట దశ వచ్చే వరకు బోరులో నీటిమట్టం గణనీయంగా తగ్గింది. పంటకు నీళ్లందించే మార్గం కనిపించలేదు. ఉన్న కొద్దిపాటి నీటితో ఎకరా పొలాన్ని తడుపుతుండటంతో మరో ఎకరా పంట ఎండిపోయింది. దీనికితోడు కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి. దీంతో చేసేది లేక ఎండిన వరిని శనివారం పశువుల మేతకు వదిలేశాడు.