కడప ఎంపీ పాత్రపై సీబీఐతో విచారణ జరిపించండి
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు వివేకా కూతురు సునీత ఫిర్యాదు
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. వివేకా హత్యలో అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉన్నదని గతంలో ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ ఫిర్యాదుకు జతచేశారు. ఈ సందర్భంగా ఆ వాంగ్మూలంలోని అంశాలను సునీత వెల్లడించారు. తన తండ్రి అంటే ఎంపీ అవినాష్‌కి గిట్టదని, అందుకే హత్య చేశారని చెప్పారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. వివేకా హత్యపై వైఎస్ జగన్, ఆయన భార్య భారతి చాలా తేలిగ్గా స్పందించారని చెప్పారు.
అనుమానితుల పేర్లను ఏపీ సీఎం జగన్‌కు చెప్తే.. ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు? నీ భర్తే హత్య చేయించాడేమో. కేసును సీబీకి అప్పగిస్తే అవినాష్‌కి ఏమి కాదు. ఆయన బీజేపీలో చేరుతాడు’ అని అన్యాయంగా మాట్లాడినట్టు వెల్లడించారు. తన తండ్రి హత్యను రాజకీయ సానుభూతి కోసం వాడుకొన్నారని విమర్శించారు. ఈ హత్యపై తాను కోర్టుకెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉన్నదని వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణరెడ్డి పేర్కొన్నట్లు చెప్పారు. వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలను అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి డైరెక్షన్లో మాయం చేశారని సునీత ఆరోపించారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డితోపాటు మరి కొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. హంతకులకు శిక్ష పడాలని, గత్యంతరం లేకనే సీబీఐని ఆశ్రయించానని సునీత తెలిపారు.