Kurmalguda | బడంగ్‌పేట, జనవరి 27 (నమస్తే తెలంగాణ): బాలాపూర్ మండల పరిధిలోని కుర్మల్‌గూడలో సర్వే నం.46లో కబ్జాలు నిజమేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ స్థలంలో నెల వ్యవధిలోనే 50 ఇండ్లు నిర్మించినట్టు గుర్తించారు. శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘కబ్జా కాండ.. సామాన్యుడిపై బండ’ అనే కథనంపై అధికారులు స్పందించారు. అక్రమ నిర్మాణాల వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై ఆరా తీశారు. కుర్మల్‌గూడలో ఎన్ని ఇండ్లకు ఇంటి నంబర్లు ఇచ్చారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను అడిగారు. ఇంటి నంబర్ల వివరాలు సేకరించారు. ప్రస్తుతం 12 ఇండ్లుకు ఇంటి నంబర్లు జారీచేసినట్టు గుర్తించారు. కరెంటు మీటర్లు ఎలా ఇస్తున్నారన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. నోటరీల మీద, ఇంటి పట్టాల విషయంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన తర్వాతే మీటర్లు జారీచేయాలని సంబంధిత అధికారులను తాసీల్దార్ ఆదేశించినట్టు సమాచారం.
కుర్మల్‌గూడలో పరిశీలనకు వచ్చిన రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా కేవలం బోర్డులు ఏర్పాటు చేసి రావడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ముందే నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేవలం రెవెన్యూ అధికారులు మాత్రమే వచ్చి బోర్డులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. అన్ని శాఖల అధికారులను తీసుకొనిపోతే ప్రజలు రెవెన్యూ అధికారులపై ఆరోపణలు చేస్తారన్న ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి.