హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కే రామకృష్ణారావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం సచివాలయంలో శాంతికుమారి నుంచి ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం పలువురు అధికారులు నూతన సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 11, 2023న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన శాంతికుమారి బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. రామకృష్ణారావు ఈ ఏడాది ఆగస్టు చివర్లో పదవీ విరమణ చేయనున్నారు.
సీఎం ముఖ్య కార్యదర్శిగా ఆంధ్రా రిటైర్డ్ అధికారి..
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజును సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఇతను రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన ఐఏఎస్ అధికారుల కేటాయింపులో భాగంగా ఏపీకి కేటాయించారు. కాగా, ఆయన ఇక్కడే ఆర్‌అండ్‌బీశాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగారు. పదవీ విరమణ తరువాత ప్రస్తుత కాం గ్రెస్ సర్కారు ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించగా, తాజాగా సీఎం ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ఢిల్లీ తెలంగాణ భవన్‌కు శశాంక్ గోయల్..
సీజీజీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్‌ను ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధా న కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెండ్రోజుల క్రితమే ఆయన సీజీజీ డైరెక్టర్ జనరల్ గా బదిలీ కాగా, తాజాగా ఆయన్ను ఢిల్లీకి బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.