బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:38:40

పటాకులు కాల్చకండి

పటాకులు కాల్చకండి

ముంబై: దీపావళి పండుగ నేపథ్యంలో కరోనా రోగుల ఆరోగ్యాన్ని, పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ర్టాలు పటాకుల విక్రయం, వినియోగంపై నిషేధం విధిస్తున్నాయి. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ ప్రజలు దీపావళి పండుగను దీపాలతోనే జరుపుకోవాలని, పటాకులు కాల్చవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.పటాకులతో పెరిగే గాలి కాలుష్యం వల్ల కొవిడ్‌ రోగులు ఇబ్బంది పడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. పండుగ నిర్వహణపై రాష్ట్ర  హోంశాఖ గురువారం మార్గదర్శకాలను విడుదల చేసింది. భౌతికదూరం నిబంధన దూరం పాటించాలని, పూజల సమయంలో ఎక్కువ మంది గుంపులుగా ఉండొద్దని పేర్కొన్నది. సాంస్కృతిక కార్యక్రమాల కంటే ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ఈసారి పటాకుల వినియోగంపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. కలకత్తాలో కాళీమాత పూజల సందర్భంగా పటాకులు కాల్చడంపై కలకత్తా హైకోర్టు కూడా నిషేధం విధించింది. ఈ నెల 15న కాళీమాత పూజ జరుగనున్నది. జగద్ధాత్రి పూజ, కార్తీక పూజల సందర్భంగా కూడా పటాకులపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. రాజస్థాన్‌, ఒడిశాల్లో ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది.

నిషేధం ఎత్తేయండి: పళనిస్వామి

పటాకులపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌లకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారికి ఆయన గురువారం లేఖ రాశారు. పటాకులపై నిషేధంతో తమిళనాడులో 8 లక్షల మంది కార్మికుల జీవనోపాధి దెబ్బతింటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.