హైదరాబాద్ : అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడి చేస్తుంటే ప్రపంచంలో అతిపెద్ద జనాభా దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత్ నేడు మౌనం పాటించడం సిగ్గు చేటనిసీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంటాడు. కానీ, యుద్ధంలో అమాయక పిల్లలు, నిరపరాధ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ ఊరుకోవడం ఇదేనా మన విదేశాంగ విధానం అని సూటిగా ప్రశ్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తోంది.
భారత్ చేయాల్సిన పని పాకిస్తాన్ చేస్తుంటే మనం ఇంకా ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందని నిలదీశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశ ప్రధాని ఒక అడుగు ముందుకు వేసి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకపోతే ఆ పర్యటనల అర్థమేంటన్నారు. గతంలో రష్యా, జర్మనీ, వియాత్నాం, క్యూబా, చైనా, ఇటలీ దేశాలకు వెళితే… సాధారణ ప్రజలు భారతీయులను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటూ ఇందిరా గాంధీని గుర్తు చేసుకునేవారు. అదే భారత్ గౌరవం, అదే భారత్ ప్రభావం అన్నారు. ఈరోజు ఆ స్థాయి ఎందుకు కనిపించడం లేదన్నారు. ఇది స్పష్టంగా నాయకత్వ వైఫల్యం అన్నారు. కష్ట కాలంలో సంధి కుదిర్చే ఒక గొప్ప అవకాశాన్ని మనం కోల్పోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు.