వరంగల్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ హైదరాబాద్ : ‘మీరు ఉద్యమాలు చేసిండ్లు.. మీకు న్యాయం చేయాలె.. అందరికీ ఇండ్లు ఇవ్వాలె.. అందరికీ పదవులు ఇవ్వాలె.. ఎక్కడి నుంచి వస్తయి.. మీరొక్కరే ఉద్యమాలు చేశారా’ అని తనను కలిసిన విద్యార్థి, యువజన నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరోవైపు అమరజ్యోతి కేంద్రంగా జరిగిన సమావేశంలోనూ ‘ఉద్యమకారులంటే వీళ్లేనా?’ అని కేకే చేసిన వ్యాఖ్యలపై ఉద్యమకారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేకే అధ్యక్షతన నియమించిన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి ముందు, సమావేశంలో కేకే చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులకు సద్దులమోసి, పదవుల్లో ఊరేగిన కేకే సైతం తాము పోషించిన పాత్రపై వ్యాఖ్యానించడం దుర్మార్గమని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అనుభవం, వయసు, పరిచయాలు ఉన్నాయని తనకు తాను మార్కెట్ చేసుకొని పదవులు అనుభవించిన కేకే సైతం.. తమపై నోరుపారేసుకోవడం దారుణమని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే కేకే వ్యాఖ్యలు చేశారని రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి సరైన రీతిలో గౌరవిస్తామని రేవంత్ సర్కార్ చేస్తున్న కుటిల యత్నాలను తాము పసిగట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పైనుంచి ఆదేశాలు రావడంతో కేకే స్పందించారు. ‘అవసరమైతే నేనే తప్పుకొంటా’ అని కేకే వ్యాఖ్యానించారని చెప్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా కేకే తెలంగాణ ప్రయోజనాలను ఎలా కాలరాశారో? అందరికీ తెలుసని ఉద్యమకారులు గుర్తుచేస్తున్నారు. తెలంగాణ కోటాలో పీసీసీ పదవి పొందిన కేకే.. తెలంగాణకు ద్రోహం చేశారని, ఈ ప్రాంత రాజకీయ నాయకుల భవితవ్యంతో కేకే చెలగాటం ఆడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీ నుంచి స్వరాష్ట్రం దాకా కేకే పదవులు అనుభవించని కాలం లేదంటూ ఉద్యమకారులు నిప్పులు చెరుగుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి పాలకుల అడుగులకు మడుగులొత్తి పదవులు పొందిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం బలపడుతుందని గ్రహించిన ఉమ్మడి పాలకులు డైవర్షన్ పాలిట్రిక్స్ చేసిన ప్లేలో కేకే సమర్థంగా నటించారని, అందులో భాగంగానే ఆయన ఆదిలాబాద్ నుంచి 2005లో పాదయాత్ర చేపట్టారనే ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
డైవర్షన్ పాలిట్రిక్స్లో పోషించిన పాత్రకే ఆయనకు రాజ్యసభ పదవి వచ్చిందని, ఆ సమయంలోనే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమై, కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వక తప్పదని గ్రహించే ‘జై తెలంగాణ’ నినాదం అందుకొన్నారని, అందులో భాగంగానే ఆయన బీఆర్ఎస్లో చేరారని, బీఆర్ఎస్లో చేరి మరో టర్మ్‌కు తన రాజ్యసభ స్థానాన్ని పొడిగించుకున్నారని చెప్తున్నారు. తన బిడ్డను హైదరాబాద్ మేయర్‌గా చేసుకున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్కు హ్యాండిచ్చి బిడ్డతో కాంగ్రెస్‌లో చేరి, ప్రభుత్వ సలహాదారు పాత్రను రసవత్తరంగా పోషిస్తున్న కేకే.. ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి చైర్మన్ పదవిని అనుభవిస్తున్నారని చెప్తున్నారు.