హైదరాబాద్,జూలై 9 (నమస్తే తెలంగాణ): తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరుగకుండా చూస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు, కమిటీ సభ్యులు హామీనిచ్చారు. అర్హులందరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని భరోసానిచ్చారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు సంప్రదింపుల ప్రక్రియ నాలుగో రోజూ గురువారం కొనసాగింది.
ఈ కీలక సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర కే కేశవరావుతో పాటు కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ,ప్రొఫెసర్ ఎం కోదండరాం, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, సభ్యులు మోతె శోభన్‌రెడ్డి, సభావత్ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు సలహాలు, సూచనలు చేశారు. ఉద్యమకారుల వినతులపై కమిటీ సభ్యులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డికి అందజేస్తామని కమిటీ సభ్యులు ఉద్యమకారులకు భరోసా ఇచ్చారు.