హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తేతెలంగాణ): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తే బీసీలు మూకుమ్మడిగా యుద్ధం ప్రకటించాలని జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వీ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. పార్టీలపరంగా కల్పించే రిజర్వేషన్లు వద్దని, చట్టప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ సెంటర్లో బుధవారం ఏర్పాటుచేసిన ‘కులగణన సర్వే-రిజర్వేషన్లు పూర్వాపరాలు-సమస్య-ఆందోళనకర అంశాలు- పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన మేధోమదన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ‘మేమెంతో మాకంత’ వాటా దక్కాలంటే బీసీలను క్షేత్రస్థాయిలో చైతన్యపర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బీసీలు తమ ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్ల రూపంలో అడుగుతున్నారని తెలిపారు.
ఆర్టికల్ 15, 16 ప్రకారం బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు బీసీలకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలని స్పష్టం చేసినా.. తప్పుడు విధానాలతో క్రీమీలేయర్ అమలు చేసి బీసీల వాటాను సైతం పాలకులు లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీని నియమించి రాష్ట్రంలో సమగ్రంగా బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో ఏ కులగణన జరగకున్నా చట్టం చేశారనిగుర్తు చేశారు. చట్టం చేయడానికి బీసీల జనాభా 50% ఉంటే చాలని తేల్చిచెప్పారు. బీసీ రిజర్వేషన్లపై ఉద్యోగులు, విద్యార్థుల్లో చైతన్యం వచ్చిందని రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, వివిధ బీసీ సంఘాల నేతలు దేవళ్ల సమ్మయ్య, సతీశ్ కొట్టె, వినోద్ కురవ, టీ తుల్జారాంసింగ్, ప్రొఫెసర్లు విశ్వేశ్వరరావు, ఐ తిరుమలి, ఎన్ సింహాద్రి, పీ నరేంద్రబాబు, ఎస్ రాధాకృష్ణ, ఏఐబీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్‌గౌడ్, సెక్రటరీ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, బీసీ సమాజ్ అధక్షుడు సంగెం సూర్యరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు లెక్కలు: జాజుల
కులగణన సర్వే పేరిట సీఎం రేవంత్‌రెడ్డి అ సెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలను ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఏడుగురు మాత్రమే బీసీలు ఉన్నారని చెప్పారు. ఎంపీ ఎన్నికల సమయంలో ఆరుగురు బీసీలకు సీట్లు కేటాయిస్తామన్న కాంగ్రెస్.. కేవలం ముగ్గురికి మాత్రమే కేటాయించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అగ్రకులాలకు కాంగ్రెస్ మద్ద తు ఇవ్వడంతో ఆ పార్టీలకు బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో తేలిపోయిందని ధ్వజమెత్తా రు. మూడు ఎమ్మెల్సీ స్థానా ల్లో బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
లోపభూయిష్టంగా సర్వే: మురళీమనోహర్
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే లోపభూయిష్టంగా ఉన్నదని ప్రొఫెసర్ మురళీమనోహర్ విమర్శించారు. సర్వేలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపారని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం కులగణన సర్వేలోని తప్పులను సవరించాలని డిమాండ్ చేశారు. నిపుణుల కమిటీ వేసి డాటాను సరిచేయాలని సూచించారు. కులగణన జరగని చో ట రీ సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కులగణన పేరిట మోసం: సతీశ్ కొట్టె
కులగణన సర్వే పేరిట బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సతీశ్ కొట్టె ధ్వజమెత్తారు. గ్రామీణ స్థాయి నుంచి బీసీ రిజర్వేషన్లపై ఉద్యమం ప్రారంభం కావాల్సి ఉన్నదని పిలుపునిచ్చారు. కులగణనపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని, ప్రభుత్వం ఆగమేఘాల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.
సమగ్ర కులగణన చేపట్టాలి: వకుళాభరణం
రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే తప్పులతడకలా మారిందని, బీసీలకు న్యాయం జరగాలంటే వెంటనే రీసర్వే చే యాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ డిమాండ్ చేశా రు. సర్వే నిర్వహించిన ప్రణాళిక శాఖలో నే సమన్వయం లేదని, గందరగోళంగా ప్రశ్నలను తయారు చేశారని విమర్శించా రు. సర్వే లెక్కలు తీస్తే 40 లక్షల మంది బీసీలు గల్లంతయ్యారని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి సర్వేలో పాల్గొనని వారి వివరాలను సేకరించాలని సూచించారు.