యాదగిరిగుట్ట, జూన్ 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉన్నదని హైకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కితాబునిచ్చారు. స్వయంభూ నారసింహస్వామిని ఆదివారం సతీసమేతంగా దర్శించుకొని పూజలు జరిపారు. ఈ సందర్భంగా విజిటర్స్ పుస్తకంలో గుట్ట నిర్మాణాలపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. స్వామివారి ఆలయానికి మరోసారి రావాలన్న ఆనందం కలుగుతున్నదని పేర్కొన్నారు.
అంతకుముందు గుట్టకు వచ్చిన ప్రధాన న్యాయమూర్తి దంపతులకు కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం జస్టిస్‌కు ఆలయ ఈవో స్వామివారి చిత్రపటం, మహాప్రసాదాన్ని అందజేశారు. అక్కడి నుంచి భువనగిరి పట్టణంలో జరుగుతున్న అఖిల భారత న్యాయవాదుల యూనియన్ మూడో రాష్ట్ర మహాసభకు హాజరైన సందర్భంగా సీజే మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఎన్నో మార్పులు, చేర్పులు చేయవచ్చు కానీ.. ప్రాథమిక హకులను మార్చలేమని అన్నారు.