హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ పీ శ్యాంకోషి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో దక్షిణ భారతావని నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ బోర్డుకు నామినేట్ అయిన తొలివ్యక్తిగా జస్టిస్ శ్యాంకోషి నిలిచారు. 1967 ఏప్రిల్ 30న మధ్యప్రదేశ్‌లో జన్మించిన శ్యాంకోషి జబల్పూర్లోని జీఎస్ కళాశాల నుంచి కామర్స్‌లో డిగ్రీ పొందారు. రాణి దుర్గావతి యూనివర్సిటీ నుంచి న్యాయవిద్య పూర్తిచేసి 1991 మార్చి 9న న్యాయవాదిగా నమోదయ్యారు. 2000 నుంచి 2013 వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లోనూ న్యాయవాదిగా పనిచేసిన ఆయన.. రాజ్యాంగం, సివిల్, సర్వీస్, లేబర్ అంశాలకు సంబంధించిన కేసులు ఎకువగా వాదించారు. సౌత్ఈస్ట్ సెంట్రల్ రైల్వే, కోల్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డుకు కౌన్సిల్‌గా వ్యవహరించారు.