జగిత్యాల, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, విద్యా సంస్థలు, వసతిగృహాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగిత్యాలలో సోమవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు అస్తవ్యస్తంగా మారాయని, కేసీఆర్ పాలనలో ఆదర్శంగా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ వచ్చిన ఏడు నెలల్లోనే మృత్యుకేంద్రాలుగా తయారయ్యాయని ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలల్లో 36 మంది విద్యార్థులు చనిపోవడం, దాదాపు 500 మంది అనారోగ్యం బారిన పడడం చూస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు.
విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం, విద్యాకేంద్రాలను కనీసం ఒక్క ప్రజాప్రతినిధి, మంత్రి సందర్శించకపోవడం బాధాకరమని, విద్యార్థుల మరణాలకు రేవంత్రెడ్డి సరారే కారణమని దుయ్యబట్టారు. నాసిరకం భోజనం పెట్టడంతో పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురువుతున్నారని, హాస్టళ్లలో పాములు, ఎలుకలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురుకుల విద్యావ్యవస్థను కాంగ్రెస్ సర్కారు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, విద్యా వ్యవస్థను సంస్కరించాలని డిమాండ్ చేశారు.