హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపినందువల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేయాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. క్షేత్రస్థాయి పరిస్థితుల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ అంచనాలు పెరిగాయని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వయిరీ కమిషన్ శుక్రవారం బీఆర్కే భవన్లో విచారణ చేపట్టింది. ఈ విచారణకు 113వ సాక్షిగా హాజరైన ఈటల రాజేందర్‌ను జస్టీస్ పీసీ ఘోష్ 40 నిమిషాలపాటు ప్రశ్నించారు. ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు? కాళేశ్వరం రీడిజైన్ ఆవశ్యకత, బరాజ్‌ల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పా టు, ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై మొత్తంగా 19 ప్రశ్నలడిగి వివరాలను ఆరా తీశారు.
ఈటల: బరాజ్‌ల నిర్మాణం అనేది టెక్నికల్ కమిటీ చూసుకుంటుంది. దానితో రాజకీయ నాయకులకు సంబంధం లేదు. సాంకేతికపరమైన నిర్ణయాలు మేము తీసుకోలేం. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బరాజ్‌లను నిర్మించాలని నిర్ణయించాం. ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించిన తర్వాతే నిర్మాణం జరిగింది.
ఈటల: తుమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత లేదని కేంద్ర జలసంఘం చెప్పింది. ముంపు నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంత రం తెలిపింది. బరాజ్‌ను 152 మీటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. 148 మీటర్ల నిర్మాణానికి మా త్రమే ఒప్పుకున్నది. ప్రాజెక్టు ద్వారా అప్పటికి 30 టీఎంసీలతో పట్టణ తాగునీటి అవసరాలు, 10 టీఎంసీలతో గ్రామీణ తాగునీటి అవసరాలు, 15 టీఎంసీలతో పారిశ్రామిక అవసరాలతోపాటు 16.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉన్నది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌ను నిర్మిస్తే అక్కడ తెలంగాణ నీటి అవసరాలను తీర్చలేము. ఆ పక్కనే అభయారణ్యం కూడా ఉండటంతో అధ్యయనం కోసం నాటి సీఎం కేసీఆర్ క్యాబినెట్ సబ్‌కమిటీ వేశారు. హరీశ్‌రావు నేతృత్వంలోని ఆ సబ్‌కమిటీలో నేను, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నా ము. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీలు కూడా సాధ్యాసాధ్యాల నివేదికలను సమర్పించాయి. వాటితోపాటు, సబ్‌కమిటీ నిర్ణయం మేరకు ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. దానికి మొత్తం క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఈటల: వాపోస్తో డీపీఆర్ ప్రిపరేషన్, ఇతర స్టడీస్ కోసం 5.9 కోట్లు కేటాయించా రు. క్యాబినెట్ ఆమోదం కూడా ఉన్నది.
ఈటల: తొలుత కాళేశ్వరం ప్రాజెక్టును రూ.63 వేల కోట్లతో ప్రతిపాదించారు. ఆ తర్వాత ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రైతుల నుంచి డిమాండ్లు రావడంతో అది రూ.83 వేల కోట్లకు పెరిగింది. క్యాబినెట్లో అన్ని అనుమతులు తీసుకున్నాం.
ఈటెల: తెలంగాణ అప్పుడే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. భారీ ప్రాజెక్టుకు ఆ మేరకు నిధులను వెచ్చించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణాల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఫైనాన్స్ పరిధిలోకి ఆ కార్పొరేషన్ రాదు.
ఈటల: కార్పొరేషన్ ద్వారా నిధులను వసూలు చేసి రుణాలు తీర్చాలనుకున్నాం. కానీ నిధులు వసూలు కాలేదు.
ఈటల: నిధుల విడుదల అంతా కార్పొరేషన్ ద్వారానే జరిగింది. ఆర్థిక శాఖకు సంబంధం లేదు.
ఈటల: ఎకడ ఏ బ్యారేజీ కట్టాలన్నా అది టెక్నికల్ టీమ్ మాత్రమే చెప్తుంది.
ఈటల: అది ఆర్థిక శాఖ కిందికి రాదు. ఇరిగేషన్ శాఖ కిందికి వస్తుంది. ఇరిగేషన్ శాఖకు ప్రత్యేకంగా అకౌంట్, అడిట్ విభాగాలు ఉన్నాయి.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా బయటపెట్టాలని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాకాకుండా ప్రాజెక్టు పేరుచెప్పి రాజకీయ పబ్బం
గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ విలువలతో కూడిన రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నానని, కణత మీద తుపాకీ పెట్టినా విలువలు పోగొట్టుకోబోనని తెలిపారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలని, బట్టకాల్చి మీద వేయడం మానేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు.