హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్‌ల ఇంజినీర్లు 16లోగా అఫిడవిట్లను దాఖలు చేయాలని ప్రాజెక్టు విచారణ కమిషన్ ఆదేశించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపైనే కాకుండా ఆయా పంప్హౌస్లపైనా విచారణకు కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. కమిషన్ ఆదేశాల మేరకు ఆయా పంప్‌హౌస్‌లకు సంబంధించిన 14మంది ఇంజినీర్లు, నిర్మాణ ఏజెన్సీ నుంచి ఇద్దరు ప్రతినిధులు సోమవారం రోజున కమిషన్ ఎదుట విచారణకు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ అంశాలన్నింటినీ 16లోగా అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని ఇంజినీర్లను కమిషన్ ఆదేశించినట్టు తెలిసింది. కాళేశ్వరంపై కాగ్, నిపుణుల కమిటీ రిపోర్టులు కూడా కమిషన్‌కు అందినట్టు సమాచారం. మరోవైపు బరాజ్‌లకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కమిషన్ ఆదేశించినట్టు తెలిసింది. వాటి పరిశీలన తర్వాత పలువురికి నోటీసులివ్వడంతోపాటు, స్టేట్ కాగ్ అధికారులను సైతం విచారణకు పిలవాలని కమిషన్ యోచిస్తున్నది.