హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ స్థాయికి రాష్ట్ర టూరిజాన్ని తీసుకెళ్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. సచివాలయంలోని తన చాంబర్లో ఆయన ఎక్సైజ్, టూరిజం, పురావస్తు, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పర్యాటక శాఖ ఫైళ్లపైనే తాను తొలి సంతకం చేసినట్టు తెలిపారు. టూరిజం ద్వారా రాష్ర్టానికి రెవెన్యూ పెంచేలా కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల టూరిజం శాఖలో సంభవించిన అగ్నిప్రమాదంపై అధికారుల నివేదిక ఆధారంగా వివరణ ఇస్తానని మంత్రి చెప్పారు. ఎక్సైజ్ శాఖపై లోతైన అధ్యయం చేస్తామని, బెల్ట్‌షాపులు, మద్యం విధానంపై ఓ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. తనకు అప్పగించిన అన్ని శాఖల్లో ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తానని, వందశాతం న్యాయం చేస్తానని వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ముఖ్య అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు.