Kollapur | కొల్లాపూర్/చిన్నంబావి : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సొంత గ్రామమైన పెద్దదగడలో తిరుగుబాటు మొదలైంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన జూపల్లి వర్గీయులు శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఉపసర్పంచ్ చిన్నకొండయ్య, వార్డుసభ్యులు బాలకృష్ణ, మైబూస్, నాయకులు నాగరాజు, ముని, మంగలిరాజుతోపాటు పలువురు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే బీరం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పెద్దదగడలో జూపల్లిపై తిరుగుబాటు మొదలైందన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. 20 ఏండ్లుగా సొంత ఊరిలోనే ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వలేని మాజీ మంత్రి జూపల్లి.. నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తాడని బీఆర్ఎస్లో చేరిన ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కార్యక్రమంలో మండల నాయకులు ఇంద్రసేనారెడ్డి, మైచందర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.