కామారెడ్డి: వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగా ప్రాజెక్టు ను సందర్శించారు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, గుల్‌గస్త్ బంగ్లా, వీఐపీ గార్డెన్, స్విమ్మింగ్ పూల్, తదితర కట్టడాలను జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి పరిశీలించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో చర్చించారు. నిజాంసాగర్ జాలాశాయంతో పాటు పరిసరాల ప్రాంతాల అభివృద్ధికి 12 ఎకరాల స్థలాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థకు రెవెన్యూ శాఖ అప్పగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే పర్యాటకులకు జలాశయంలో ఆహ్లాదం కోసం బోటింగ్, డ్యాం దిగువన కాటేజీలు, ఉద్యానవనం, చిన్న పిల్లల పార్కు తదితర సౌకర్యాలు అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అనంతరం నిజాజంసాగర్ హైడ్రో పవర్ స్టేషన్‌ను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వర ప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉందని, వందేండ్లు గడిచినా చెక్కుచెదరలేదని అన్నారు. మూడు కాలాలు ఎప్పడూ నిండుకుండలా ఉన్న నిజాంసాగర్ జలాశయం పర్యాటక అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో (పీపీపీ) ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు త్వరలోనే నూతన పర్యాటక పాలసీ అమల్లోకి తెస్తామని వెల్లడించారు. నిజాంసాగర్ హైడ్రో పవర్ స్టేషన్లో 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో చర్చించి, దీన్ని పూర్తిగా ఆధునీకరిస్తామని పేర్కొన్నారు.