హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు ఉత్పత్తి పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటున్నదని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు చికుడు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో కనిష్ఠ నీటిమట్టం స్థాయి 834 అడుగుల (254.2 మీటర్లు)కు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయని జూపల్లి గుర్తుచేశారు. ఈ నిబంధనలను తుంగలో తొకి ఏపీ సరార్ అన్యాయంగా నీటిని తోడేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా ఏపీ ప్రభుత్వం మొండివైఖరి వీడటం లేదని విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగం, కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు పాలమూరు ప్రజాప్రతినిధులమంతా ఏకమై శ్రీశైలం వద్ద ‘వంటా-వార్పు’ కార్యక్రమానికి పిలుపునిచ్చామని మంత్రి తెలిపారు. జిల్లా ప్రజల హెచ్చరికల తీవ్రతను గమనించిన తర్వాతే ఏపీ ప్రభుత్వం దిగివచ్చి విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసిందని చెప్పారు. పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగితే రైతు పక్షాన నిలబడి ప్రభుత్వం పోరాడుతుందని తేల్చిచెప్పారు. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉమ్మడి పాలనలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి వాటాల అంశంలో తెలంగాణ హకుల ఉల్లంఘన జరిగినప్పుడు తాము ఆందోళనలు చేశామని, హైకోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తుచేశారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా తమకు పాలమూరు ప్రయోజనాలే ముఖ్యమని, నీటి కేటాయింపుల విషయంలో ఎవరితోనూ రాజీపడబోమని జూపల్లి స్పష్టంచేశారు.