కొత జిల్లాల ప్రకారం క్యాడర్ రీఆర్గనైజేషన్ పూర్తి
సర్క్యులర్ జారీచేసిన ఇంటర్ విద్య కమిషనర్ జలీల్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యలో క్యాడర్ విభజన ప్రక్రియ పూర్తయింది. గతంలో జోనల్ క్యాడర్లో ఉన్న ప్రిన్సిపాల్ పోస్టును స్టేట్ క్యాడర్‌గా మార్చారు. దీంతో ప్రిన్సిపాళ్లు రాష్ట్రంలోని 405 జూనియర్ కాలేజీల్లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. తీవ్ర కసరత్తు తర్వాత కొత్త జిల్లాల ప్రకారం పోస్టులను కేటాయించారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయిలో ఏయే పోస్టులు ఉండాలనే విషయాన్ని ఖరారుచేస్తూ శుక్రవారం ఇంటర్‌విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ సర్క్యులర్ జారీచేశారు. జోన్ క్యాడర్లో ఉన్న జూనియర్ లెక్చర ర్లు, పీడీ, లైబ్రేరియన్ పోస్టులను మల్టీజోన్‌లో కేటాయించారు. నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకా రం కొత్త జిల్లాలు, జోన్లు అమల్లోకి రావడంతో ఇంటర్ విద్యలోను మార్పులు చేశారు. ఈ ఉత్తర్వులు అమల్లో రాగా, త్వరలోనే పదోన్నతులు, బదిలీలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
స్టేట్ క్యాడర్లో ఇంటర్ విద్య కమిషరేట్ కార్యాలయంలోని అన్ని పోస్టులు. డ్రైవర్ల నుంచి కమిషనర్ స్థాయి వరకు, ప్రిన్సిపాళ్లు, డీఐఈవో పోస్టులు ఉంటాయి. జోనల్ క్యాటగిరీలో సూపరింటెండెంట్లు, ఆడిటర్లు, కంప్యూటర్ టెక్నిషన్లు, సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, సీనియర్ ఇన్స్ర్టక్టర్ పోస్టులు ఉంటాయి. మల్టీ జోనల్ క్యాటగిరీలో డిప్యూటీ డీఐఈవో, అడ్మిసిస్ర్టేటివ్ ఆఫీసర్లు, జూనియర్ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉంటాయి. జిల్లా క్యాడర్లో జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ల్యాబ్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్ల పోస్టులు ఉంటాయి.