మధ్యవర్తిత్వంపై యువ న్యాయవాదులకు శిక్షణ
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): దేశంలోని యువ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నడుం బిగించారు. ఆయన సూచనల మేరకు హైదరాబాద్లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)లో ప్రత్యేక విభాగాన్ని (యంగ్ వింగ్) ఏర్పాటు చేశారు. దీని ద్వారా యువ న్యాయవాదులకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిఖ్ఖాన్ వెల్లడించారు.
మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేసుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలు, కక్షిదారుల పట్ల వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై ఈ శిక్షణ సాగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల యువ న్యాయవాదులకు ఆన్లైన్లో సదస్సులు, చర్చా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ, ఏపీకి చెందిన యువ న్యాయవాదులకు శుక్రవారమే శిక్షణ ప్రారంభమైందని చెప్పారు. శనివారం జరిగే కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రసంగిస్తారని తెలిపారు.