Telangana Talli | హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాంగ్రె స్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 9న) సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. కొత్త విగ్రహం రూపురేఖలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వం తాను రూపొందించిన నమూనానే ప్రతిష్ఠించేందుకు ముందుకు సాగుతున్నది. దీంతో విగ్రహ ప్రతిష్ఠాపనను ఆపాలని కోరుతూ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, ప్రముఖ కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ సహా పలువురు విగ్రహ హైకోర్టును ఆశ్రయించారు.
సోనియాగాంధీ తన జన్మదిన కానుకగా తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందని, ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటున్నది. అయితే, ఈ నూతన విగ్రహం రూపంపై రాష్ట్రవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘాలు, అనుబంధ మేధావులు మినహా తెలంగాణ సమాజం అంతా కొత్త విగ్రహం కాంగ్రెస్ చెయ్యి గుర్తును ప్రచారం చేసేదిగా ఉన్నదని అభిప్రాయపడుతున్నది. 2006 నుంచి తెలంగాణ ప్రజల మదిలో స్థిరపడిపోయిన తల్లిభావనను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలచుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విగ్రహంలో మార్పును తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా ప్రజలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అభివర్ణిస్తున్నారు. ‘నా కోటి రతనాల వీణ’ అని మహాకవి దాశరథి అన్నట్టుగానే ఉద్యమకాలంలో నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో అనేకమంది మేధావులు, బుద్ధిజీవులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో తెలంగాణ తల్లిరూపుదిద్దుకున్నది. కేసీఆర్ మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద వీసమెత్తు కూడా అవగాహన, సోయిలేని వ్యక్తి నేడు దానిని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాడని పరోక్షంగా రేవంత్‌రెడ్డిపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది.