నల్లగొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అనేక షరతులతో రుణమాఫీ(Loan waiver) చేయడం వల్ల అర్హులైన పేద రైతులకు అన్యాయం జరుగుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Ranga Reddy) విమర్శించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంకేతిక కారణాలతో ధరణిలో నమోదు కాని భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ కాలేదని, ఈ కారణంగా రైతులకు రుణమాఫీ వర్తింప చేయకపోవడం సరికాదని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సాగు కోసం రైతులు తీసుకున్న అన్ని రకాల రుణాలను ఏక కాలంలో మాఫీ చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పంట పెట్టుబడుల కోసం పేద రైతులు, కౌలు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగారని, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం అలాంటి వారిని అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
రూ.2 లక్షల రుణమాఫీని ఏక కాలంలో చేయాల్సింది పోయి రెండు లక్షలపైన ఉన్న బకాయిలు ముందుగా చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కుటుంబంలో ఒకరికే రుణమాఫీ వర్తిస్తే మిగతా వారు రైతులు కాకుండా పోతారా? అని ప్రశ్నించారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి ఒక్కరై రైతేనని, అందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.