పెద్ద కొడప్గల్, డిసెంబర్ 16: కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం విఠల్వాడి తండాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును బీఆర్ఎస్ శ్రేణులు, తండావాసులు అడ్డుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నిక ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా పెద్దకొడప్ మండలం విఠల్వాడి తండాకు మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో ప్రచారానికి వచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, తండావాసులు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. ‘ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసిందని, ఈ రాత్రి ఎందుకు వచ్చారు?, డబ్బు, మద్యం పంపిణీ చేయడానికి వచ్చారా.. ఎన్నికల కోడ్ ఉండదా? ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అంటే ఇదేనా.. చట్టాలు ఉండవా.. అంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యేను అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో పోలీసులు రంగప్రవేశంచేసి లాఠీచార్జి చేయడానికి యత్నించగా తండావాసులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను రక్షించే రక్షక భటులు చట్టాలు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతారా, ఆయనను తప్పించి మమ్మల్ని కొడుతారా .. అంటూ పోలీసులను నిలదీశారు. తండావాసులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేను వెంబడించి వెనక్కి పంపించారు.