జమ్మికుంట, నవంబర్ 15: ‘నెలలుగా జీతాల్లేవు. బిల్లులు వస్తలేవు. అప్పులు తెచ్చి పెడ్తున్నం. ఆగమై పోతున్నం. ఎట్ల బతుకుడు సార్.. బిల్లులు అచ్చెటట్టు చేయుండ్రి.’ అం టూ మధ్యాహ్న భోజన నిర్వాహకులు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సీనియర్ సివిల్ సబ్‌కోర్టు జడ్జి పీబీ కిరణ్‌కుమార్‌తో మొరపెట్టుకున్నారు. ఇటీవల జమ్మికుంటలోని ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలోగల ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లతో తిన్న తర్వాత 26మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా సబ్ జడ్జి కిరణ్‌కుమార్ శనివారం పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంట గదులు, అన్నం, పాలకూర పప్పు, కూరగాయలు, తదితర సామగ్రిని పరిశీలించారు. గుడ్లు ఎక్కడ? అంటూ ప్రశ్నించడంతో ఈ రోజు మెనూలో లేదని నిర్వాహకులు తెలిపారు. అన్నం, పప్పుతో తిన్న తర్వాత మెనూ ప్రకారం మిక్స్డ్ వెజ్ కర్రీ ఎందుకు వండలేదని అడగడంతో బిల్లులు రావడం లేదని, వేతనాలివ్వడం లేదని, అప్పులు చేశామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులిప్పియాలని వేడుకోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడుతానని జడ్జి చెప్పారు. కాలం చెల్లిన సామగ్రిని వాడకూడదని, మెనూ తప్పని సరిగా పాటించాలని సూచించారు. అనంతరం ఎస్వీ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను తెలుసుకున్నారు.