P Vishnu Vardhan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో జుబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీ నేత పీ విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దివంగత కాంగ్రెస్ నేత పీ జనార్ధన్ రెడ్డి తనయుడే విష్ణువర్ధన్ రెడ్డి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జుబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ.. విష్ణు వర్ధన్ రెడ్డికి మొండిచేయి చూపింది. విష్ణు వర్ధన్ రెడ్డికి బదులు మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌ను అభ్యర్థిగా ఖరారు చేసింది.
విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆయన మద్దతుదారులు శనివారం గాంధీభవన్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. తొలి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విష్ణువర్ధన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తాజాగా జుబ్లీ హిల్స్ కాంగ్రెస్ టికెట్ నిరాకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో విష్ణు వర్ధన్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
2009 ఎన్నికల్లో జుబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణువర్ధన్ రెడ్డి.. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆయన సోదరి పీ విజయా రెడ్డి 2014 ఎన్నికల్లో ఖైరతాబాద్ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి రెండు దఫాలు ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కానీ, గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయారెడ్డికి ఖైరతాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది.