హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ను బొంద పెడుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ను ఏం చేయలేరని, అది ఎవరితరం కాదని పేర్కొన్నా రు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ ని యోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం గోపినాథ్ మీడియాతో మాట్లాడుతూ… రాజధాని ఓట ర్లు అభివృద్ధికి పట్టం కట్టారని కొనియాడారు.
సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి అసెంబ్లీ ఓట్ల ఆధారం గా చూస్తే బీఆర్ఎస్ భారీ ఆధిక్యంలో ఉన్నదని తెలిపారు. ఇదే ఓటింగ్ సరళి కొనసాగాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 100 రోజుల తరువాతే అడుగుతామని స్పష్టం చేశారు. కేటీఆర్ ఓపికగా కార్యకర్తల అభిప్రాయాలు వింటున్నారని చెప్పా రు. కార్యకర్తలను కాపాడుకుంటామని, ఇలాంటి చర్చలు పార్టీలో చాలా అవసరమని గోపీనాథ్ పేర్కొన్నారు. తాము రేషన్ కార్డుల కోసం ప్రజలను లైన్లో నిలబెట్టలేదని, అయినా ఆరు లక్షల కార్డులను ఇచ్చామని గుర్తుచేశారు. సికింద్రాబాద్ లోక్సభ సీటును బీఆర్ఎస్ కైవసం చేసుకొంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు.