ఉపఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత ప్రచారంలో దూసుకు పోతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, మాగంటి అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. రెండేండ్లుగా సీఎం రేవంత్ పాలనలో నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. 12 ఏండ్లుగా తన భర్త చేసిన సేవలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను గుర్తుచేసి ఓట్లు అడుగుతున్నారు.
హైదరాబాద్/బంజారాహిల్స్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు (Maganti Sunita) జూబ్లీహిల్స్ (Jubilee Hills) ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. భర్త గోపీనాథ్ (Maganti Gopinath) ఆకస్మిక మరణంతో జనంలోకి వచ్చిన సునీత గోపీనాథ్‌ను అన్ని వర్గాల ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా బస్తీ జనం సునీత కన్నీళ్లను పంచుకుంటున్నారు. గోపన్న తమకు చేసిన మంచిని గుర్తుచేసుకుంటున్నారు. ఆమెకు అడుగడుగునా మంగళహారతులు పట్టి తోడుంటామని భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇప్పటికే డివిజన్ల నేతలతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికను ఎలా ఎదుర్కోవాలో కేటీఆర్ డివిజన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. వెంగళరావునగర్ డివిజన్ యాదగిరినగర్‌లో పార్టీ శ్రేణులతో కలిసి మాగంటి సునీత గోపీనాథ్ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒకరినీ పలకరించారు.
ఈ సందర్భంగా ‘గోపన్న నీకు అన్యాయం చేసి పోయిండమ్మా..’ అని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. గోపీనాథ్ జ్ఞాపకాలను తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సునీతను, వారి కూతుళ్లు అక్షత, దిషీరాను ప్రజలు ఓదార్చారు. అంతకుముందు షేక్‌పేట డివిజన్లో పర్యటించి అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఇంటింటికీ బాకీకార్డులు పంచిపెట్టారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. హైడ్రా కూల్చివేతలకు అనుమతులు ఇచ్చినట్టేనని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్‌లో పేదల నివాసాలు ఉండవని హెచ్చరించారు. ఇప్పటివరకు బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసూఫ్‌గూడ డివిజన్లలో ఇంటింటి ప్రచారం చేశారు. ‘12 ఏండ్లుగా మీరు గోపన్నను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. ఆయన ఆశయాలు కొనసాగించాలని కేసీఆర్ మరోసారి నన్ను మీ దగ్గరకు పంపించారు. ఆశీర్వదించండి’ అంటున్న సునీతా గోపీనాథ్ మాటలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది.
మైనారిటీ ఓటర్లే వెన్నెముక
నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాగంటి గోపీనాథ్‌కు మైనారిటీలతో మంచి సంబంధాలు ఉండేవి. వారి ఆదరణతోనే ఆయన వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో త్రిముఖ పోటీలో 12 వేల ఓట్ల ఆధిక్యత సాధించిన మాగంటి గోపీనాథ్.. 2018లో 14 వేలు, 2023లో 17 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. తాజా పరిస్థితుల్లో మైనారిటీ ప్రజలు గంపగుత్తగా సునీతా గోపీనాథ్ వెంట నిలబడాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఆయా డివిజన్లలో పెద్దలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసుకొని అంతర్గతంగా చర్చించుకున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ, గోపీనాథ్ ఇంతకాలం తమకు అండగా ఉన్నారని, కాబట్టి, బీఆర్ఎస్కే ఓటు వేద్దామనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
నియోజకవర్గంలో 1.3 లక్షల మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారని, 90% మంది బస్తీల్లోనే ఉంటున్నామని, కాంగ్రెస్‌ని గెలిపిస్తే హైడ్రా బుల్డోజర్లు వచ్చి బస్తీల మీద పడతాయని చర్చించుకున్నట్టు తెలిసింది. షేడ్పేట, బోరబండ, రహ్మత్‌నగర్, యూసూఫ్‌గూడ డివిజన్లతోపాటు ఇతర ప్రాంతాల్లోని మైనారిటీ మహిళలు సునీతా గోపీనాథ్ పట్ల సానుభూతితో ఉన్నట్టు తెలుస్తున్నది. మైనారిటీల మద్దతు బీఆర్ఎస్కే ఉన్నట్టు ఇప్పటికే పలు సర్వేలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వేల్లో కూడా 70% ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ వైపే ఉన్నట్టు తేలిందని సమాచారం.
ప్రదీప్‌చౌదరి చేరికతో..
వెంగళరావునగర్, శ్రీనగర్కాలనీతోపాటు ఎర్రగడ్డ డివిజన్లోని కొన్ని కాలనీల్లో మాగంటి గోపీనాథ్ సొంత సామాజికవర్గానికి చెందిన ఓటర్లు సుమారు 25 వేలకుపైగా ఉన్నారు. వారంతా సునీత గోపీనాథ్‌కు అండగా నిలబడుతున్నారు. ఆమెకు మద్దతుగా అంతర్గత సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జూబ్లీహిల్స్ కీలక నేత వేములపల్లి ప్రదీప్‌చౌదరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం మరింత సానుకూలంగా మార్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. తన పరిచయాలతోపాటు గోపీనాథ్ అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రదీప్‌చౌదరి ఓటర్ల మద్దతును కూడగడుతున్నారు.