Government schemes | బంజారాహిల్స్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎక్కువ భాగం మహిళల పేరుతోనే ఉన్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ప్రశాసన్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మహిళలు పెద్ద సంఖ్యలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. సుమారు 100 మందికిగా పైగా మహిళలు స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని ఎమ్మెల్యే దానం నాగేందర్ క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి, గృహలక్ష్మి, కేసీఆర్ కిట్స్, షాదీ ముబారక్ తదితర పథకాల వల్ల మహిళలకు ఎంతో లబ్ధి కలిగిస్తున్న సీఎం కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలనుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళల ఆశీర్వాదంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు మారమ్మ, మహేశ్వరి. రమణక్క, భాగ్య పాల్గొన్నారు.
బస్తీలో పేదలందరికీ గృహలక్ష్మి
ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని రామకృష్ణనగర్ బస్తీలోని పేదలకు సొంతింటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రామకృష్ణానగర్ బస్తీకి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 50 మంది మహిళలు సోమవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలోకి స్వాగతం పలికారు. బస్తీలోని రేకుల ఇండ్లను పక్కా ఇండ్లుగా కట్టుకునేందుకు గృహలక్ష్మి పథకం కింద సాయం అందిచాలని మహిళలు ఎమ్మెల్యేను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. గతంలో బస్తీకి సమస్యలు వచ్చినప్పుడు తాను అండగా నిలబడ్డానని, ఇప్పుడు కూడా గృహలక్ష్మి కింద అందరికీ సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. తొలి విడతలో 100 మందికి సాయం అందిస్తామని, రెండో విడతలో మిగిలిన వారందరికీ రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్, మెట్టు రాజు, కృష్ణ, మంగ, నవనీత, రుక్మిణి, సరిత, సంగీత, సరళ పాల్గొన్నారు.