హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఓటర్లకు విచ్చలవిడిగా మద్యం, నగదు, లక్షలాది చీరలు, కుక్కర్లు, గ్రైండర్ మిక్సీలు పంపిణీ చేస్తూ ప్రజాస్వామిక విలువలను తుంగలో తొక్కుతున్నదని ధ్వజమెత్తారు. అడ్డదారిలో గెలిచేందుకు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. సోమవారం హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్ బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పాల్పడుతున్న అక్రమాలు, పైసల పంపకం, ఆ పార్టీ నేతల ఆగడాలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
ఫొటోలు, వీడియోలతో కూడిన ఆధారాలను సమర్పించారు. ముఖ్యంగా ఫేక్ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేశారని, ఇందుకు సంబంధించిన వివరాలను, సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల వివరాలను సీఈవోకు అందజేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. పైసలు, చీరెలు, దుస్తులు పంపిణీని అడ్డుకోవాలని కోరారు. సీ విజిల్ యాప్‌లో కైంప్లెంట్ చేశారు. అనంతరం మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి బీఆర్కే భవనం ప్రాంగణంలో హరీశ్ విలేకరులతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆగడాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. కొందరు పోలీసు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఓటర్లకు డబ్బులు, మద్యం పంచిపెడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నా పట్టించుకోవడంలేదని చెప్పారు. హస్తంపార్టీ నాయకులపై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకొనేందుకు వెనుకాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా, అధికార దుర్వినియోగం చేసినా జూబ్లీహిల్స్‌లో విజయం బీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తంచేశారు.
పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఈవోను కోరినట్టు హరీశ్ చెప్పారు. ముఖ్యంగా బూత్‌ల వద్ద అంగన్వాడీ, ఆశ కార్యకర్తలను నియమించి ఓటేసేందుకు వచ్చిన వారి ఐడెంటిటీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని డిమాండ్ చేశారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని, పోలింగ్ స్టేషన్ల వద్ద నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉన్నదని స్పష్టం చేశారు.
సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ బూత్‌ల వద్ద కేంద్ర బలగాలను నియమించాలని సీఈవోకు విజ్ఞప్తిచేసినట్టు హరీశ్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఫేక్ ఓటరు కార్డులను తయారు చేయించి దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే ఎన్నికల పరిశీలకులు, డీఆర్వో, ఆర్వోలకు అందజేశామని వెల్లడించారు.
యూసుఫ్‌గూడలో కాంగ్రెస్ కార్యాలయం పక్కనే పోలింగ్ బూత్ పెట్టడంపై హరీశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ చర్య అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని నిప్పులు చెరిగారు. దొంగ ఓట్లు వేయించేందుకే కాంగ్రెస్ అధికారులపై ఒత్తిడి తెచ్చిందని అనుమానం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ అధికారికి ఆధారాలు సమర్పించామని, మార్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్టు తెలిపారు.
అధికార కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు దిగినా జూబ్లీహిల్స్ ఓటర్లు కారు పార్టీకే మద్దతిస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉన్నదని హరీశ్ చెప్పారు. ఇక్కడి ఓటర్లు తెలివైన వారని, పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థి సునీతమ్మను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని స్పష్టంచేశారు. కారుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చిల్లర డ్రామాలను కట్టిపెట్టాలని హితవు పలికారు. ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కాంగెస్ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. హరీశ్ వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కొప్పుల ఈశ్వర్, వీ శ్రీనివాస్‌గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత కిషోర్‌గౌడ్ పాల్గొన్నారు.
వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని, మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రెండేళ్ల తర్వాత ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీలు గుర్తుకురావడం సిగ్గుచేటని హరీశ్ దెప్పిపొడిచారు. ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్‌లు, అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఇచ్చిన హామీలపై పట్టించుకోని ఆయన ఇప్పుడు ఆగమేఘాలపై సమీక్ష పేరిట డ్రామాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. ‘ఇన్నాళ్లు ఎందుకు కాలయాపన చేసిండ్రు? అమలు చేస్తామంటే అడ్డుకున్నది ఎవరు?’ అంటూ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఇలాంటి చిల్లర, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.