హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార భవన్లో కొత్త స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సీహెచ్ ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. తక్షణమే అక్రెడిటేషన్లు ఇవ్వాలని, కొత్త ఆరోగ్య విధానాన్ని తీసుకురావాలని కోరింది. ఇండ్లస్థలాలు, అక్రెడిటేషన్లు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టుల సమస్యలు, వేజ్‌బోర్డు అమలు, ప్రత్యేక రక్షణ చట్టం, రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకం, మీడియా అకాడమీ శిక్షణా తరగతులు, మీడియా కమిషన్ తదితర అంశాలను స్పెషల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా అక్రెడిటేషన్లకు నాలుగోసారి స్టికర్లు వేయబోతున్నారని, ఇది సరికాదని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో పాత్రికేయులు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని, ఉద్యోగుల కోసం కొత్తగా తెచ్చే ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని కోరారు. మీడియా అకాడమీ జర్నలిస్టులకు ఇచ్చే శిక్షణాతరగతుల్లో వివక్ష చూపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పెన్షన్ పథకాన్ని రిటైరైన జర్నలిస్టులకు తెలంగాణలో కూడా అమలుచేయాలని కోరారు. రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే చోట నుంచి రవాణా సౌకర్యం కల్పించేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశారు. మీడియాతో పాటు జర్నలిస్టుల పరిస్థితులను అధ్యయనం చేసి పరిషరించేందుకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముందుగా రుణం చెల్లిస్తే అదనపు వసూళ్లా? ; ఎగవేతదారులను మాత్రం కట్టడి చేయలేరు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తీసుకున్న రుణాన్ని గడువులోగా చెల్లించినా అదనపు వసూళ్లు చేసిన బ్యాంకుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వేల కోట్లు ఎగవేసే వారిని కట్టడి చేయలేని బ్యాంకులు.. సజావుగా రుణం చెల్లించేవాళ్ల నుంచి అదనపు వసూళ్లు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఎగవేతదారులపై చర్యలు తీసుకోలేని బ్యాంకు అధికారుల వల్ల ఆ ప్రభావం సాధారణ, మధ్యతరగతి ప్రజలపై పడుతున్నదని వ్యాఖ్యానించింది. మధ్యతరగతి ప్రజలు రుణాలు తీసుకునేప్పుడు చార్జీల భారాన్ని మోపుతున్నారని, చెల్లింపులు ఆలస్యమైతే జరిమానాల పేరుతో వారి ఖాతాల నుంచి జప్తు చేస్తున్నాయని తప్పుబట్టింది. సనత్‌నగర్ ఎస్బీఐ బ్రాంచిలో తీసుకున్న రుణాన్ని ముందస్తు చెల్లింపులు చేసిన తమకు సమాచారం ఇవ్వకుండానే చార్జీలను మినహాయింపు చేయడాన్ని సవాల్ చేస్తూ ఉత్తమ్ ధాటు అండ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. తీసుకున్న రుణాన్ని ముందుగా చెల్లించినా.. తమ ఖాతా నుంచి రూ.1.16 కోట్లను బ్యాంక్ మినహాయించుకున్నదని సంస్థ తరఫు న్యాయవాది చెప్పారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకు చర్య ఉన్నదని, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ముందుగా రుణం చెల్లిస్తే మినహాయింపు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆర్బీఐ వాదనల నిమిత్తం విచారణను వాయిదా వేశారు.