హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ) : ఇండ్ల స్థలాలు.. జర్నలిస్టుల చిరకాల స్వప్నం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా కలం కార్మికుల కల సాకారం కావడం లేదు. రైతులు, మహిళలు, విద్యార్థులను మోసం చేసినట్టుగానే కాంగ్రెస్ సర్కార్ మేధోవర్గమైన జర్నలిస్టులను సైతం మోసం చేసింది. ఇండ్ల స్థలాల పేరిట బుట్టలో వేసుకొని వెన్నుపోటు పొడిచింది. ఫలితంగా జర్నలిస్టులు కిరాయి బతుకులతో కాలం వెళ్లదీస్తున్నారు. ‘సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉ న్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం. అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లాలవారీగా స్థలాలు కేటాయిస్తాం’ అని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి గద్దెనెక్కిన సర్కార్ తీరా విస్మరించింది. రెండున్నరేండ్లుగా అదిగో.. ఇది గో అంటూ కాలయాపన చేస్తున్న సర్కార్‌పై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.
‘ఫ్యూచర్‌సిటీలో జర్నలిస్టులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు మంచికాలనీ కట్టుకుందాం. అంతా పక్కపక్కనే నివసించే ఏర్పాట్లు చేసుకుందాం. మహిళా దినోత్సవం సందర్భంగా శుభవార్త తెచ్చామని మీ ఇంట్లో చెప్పండి.’ ఇది మార్చి 8 అంతర్జాతీయ మహి ళా దినోత్సవాన మహిళా జర్నలిస్టులతో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలివి. సీఎం ప్రకటనతో జర్నలిస్టులంతా సంబురపడిపోయారు. కానీ మూడు నెలలు గడిచినా ‘ఫ్యూచర్’ మాత్రం కనిపించడం లేదు. చివరికి మే 21న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇండ్ల స్థలాలపై చర్చిస్తామని, జూన్ 2న అధికారిక ప్రకటన చేస్తామని ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. కానీ రాష్ర్టావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగంలో జర్నలిస్టుల సంక్షేమం.. ఇండ్ల స్థలాల ఊసేలేకుండా పోయింది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
జర్నలిస్టుల సంక్షేమం గురించి సర్కార్ పట్టించుకున్న దాఖలాల్లేవు. వాస్తవానికి మీడియా సంస్థల ప్రధాన కార్యాలయాలు గ్రేట ర్ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కీలక విభాగాలు గ్రేటర్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. ఇండ్ల స్థలాల కోసం రెండున్నరేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులను కలిసి వినతిపత్రాలిస్తున్నా ఎలాంటి స్పందన లేదు. జవహర్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఖమ్మం, వరంగల్ జిల్లాకేంద్రాల్లోని జర్నలిస్టులదీ ఇదే పరిస్థితి.
రాష్ట్రంలోని గ్రామీణ విలేకరులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ పాలనలోనే వేలాది మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు దక్కాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో 116 ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను జర్నలిస్టుల చేతికందించారు. వరంగల్ శివారులో 118మంది 2బీహెచ్‌కే ఇండ్లు దక్కాయి. నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ దవాఖాన వెనుక నాలుగెకరాల్లో 80మందికి ఇండ్ల స్థలాలు కేటాయించారు. సిరిసిల్లలో 250 గజాల చొప్పన ఇండ్ల స్థలాలిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టాలు అందాయి. భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోనే ఇండ్ల స్థలాల పంపిణీ జరిగింది. దేవరకద్ర నియోజకవర్గంలో మండల స్థాయి విలేకరులకు, వనపర్తి నియోజకవర్గం పెబ్బేర్‌లో స్థలాలిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్, జిన్నారంలలో ఖరీదైన స్థలాలను జర్నలిస్టులకు కేటాయించారు. గ్రేటర్లో మహేశ్వరం, శేరిలింగపల్లి, మేడ్చల్ వంటి నియోజకవర్గాల్లోని క్షేత్రస్థాయి జర్నలిస్టులకు ఇంటి స్థలాల రూపంలో కేసీఆర్ సర్కార్ న్యాయం చేసింది. కరీంనగర్లో కేసీఆర్ సర్కార్ 80మందికి పైగా జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తే.. కాంగ్రెస్ అడ్డుకున్నది.
ఫ్యూచర్‌సిటీలో హైదరాబాద్ జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించినట్టు సర్కార్ ప్రకటించింది. జాబితాలు తీసుకున్నది. హౌసింగ్ సొసైటీలతో సంప్రదింపులు జరిపింది. జూన్ 2న పట్టాలిస్తామని చెప్పి.. పత్తాలేకుండా పోయింది. మరోవైపు జవహర్ సొసైటీ ఆధీనంలోని 70 ఎకరాలను స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్, ఖమ్మంలో స్థలాలు కేటాయించినా ఇప్పటివరకు అప్పగించలేదు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలివ్వాలి.
ఇండ్ల స్థలాలిస్తామని ఎన్నికల ముందు చెప్పడం.. ఆ తర్వాత విస్మరించడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ప్రభుత్వ ప్రకటనలు చూస్తుంటే ఆశపెట్టి వెక్కిరించినట్లుంది. మళ్లీ ఎన్నికల వరకు కాలయాపన చేయకుండా తక్షణమే ఇంటి స్థలాలపై చొరవ చూపాలి. హైదరాబాద్ సహా జిల్లాలు, మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి. కేవలం జీవోలు ఇస్తే సరిపోదు. స్థలాలిచ్చి ఆదుకోవాలి.