కొల్లాపూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో (Kollapur) సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగింది. కవరేజ్ వెళ్లేందుకు పాసులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోని పోలీసులు నమస్తే తెలంగాణ ఆర్సీ ఇంచార్జ్ సీపీ నాయుడు, పెంట్లవెల్లి మండల రిపోర్టర్ రమణోజిరావు, కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ స్వామితోపాటు మరి కొంతమంది రిపోర్టర్లను అర్ధరాత్రి వేళ వారి ఇండ్ల నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గత నెల 25 నుంచి కొల్లాపూర్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కొల్లాపూర్ నియోజక వర్గం లోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ జర్నలిస్టులు రిలే దీక్షలు చేస్తున్నారు. గత 24 రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. కొల్లాపూర్ నియోజక వర్గంలోని ఏ ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలం ఇవ్వని ప్రభుత్వం, న్యాయం కోసం దీక్షలు చేస్తున్న జర్నలిస్టులను బీఆర్ఎస్ కార్యకర్తలుగా ముద్ర వేసింది. అయినా ఎక్కడా పక్షపాతం చూపించకుండా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిత్యం వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న జర్నలిస్టుల వృత్తికి ఆటంకం కలిగిస్తూ పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేశారని సీనియర్ జర్నలిస్టులు బచ్చలకూర కురుమయ్య జలకం మద్దిలేటి ఆరోపించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌కు శుంకుస్థాపన, స్వయం సహాయక సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమ కవరేజ్ కోసం ప్రభుత్వం రిపోర్టర్లకు పాసులను కూడా మంజూరు చేసింది. కానీ కవరేజ్‌కి వెళ్లకుండా నియంత్రించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం పునారోలోచన చేసుకోవాలన్నారు.
Kollapur 1