నమస్తే నెట్వర్క్, డిసెంబర్ 27: జీవో 252ను సవరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(హెచ్143), టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. 33 జిల్లాల కలెక్టరేట్ల వద్ద శనివారం ఆందోళనలు నిర్వహించారు. జర్నలిస్టులంతా ఒక్కటేనని.. రెండు కార్డుల విధానం వద్దని నినదించారు. 14వేల మంది జర్నలిస్టుల గొంతునొక్కేలా తెచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని గళమెత్తారు. ప్లకార్డులు పట్టుకొని కలెక్టరేట్ల ఎదుట బైఠాయించారు. అనంతరం కలెక్టర్లకు, పలు చోట్ల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
కరీంనగర్లో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు కే ప్రకాశ్‌రావు మాట్లాడుతూ, రెండు కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి జర్నలిస్టుల్లో విభజనరేఖ గీయడం సమంజసమేనా..? అని ప్రశ్నించారు. అక్రెడిటేషన్ మంజూరు విధానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పాత్రికేయుల గౌరవాన్ని దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడం మానుకొని గత జీవోనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో టీన్యూస్ ప్రతినిధి వేణుగోపాలరావు, టీయూడబ్ల్యూజే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోపాలకృష్ణ, డెస్క్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు సంపత్, ప్రతినిధులు సుభాష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి, సంఘం నాయకులు వెన్నబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్, నేతలు మహ్మద్ రఫీ, గుర్రం రాజేశ్, చండ్ర నరసింహారావు, వట్టికొండ రవి. తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే హెచ్ -143 హనుమకొండ జిల్లా కమిటీతో డెస్క్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ డెస్క్ జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్, సెక్రటరీ అర్షం రాజ్‌కుమార్, రాష్ట్ర నాయకులు బీఆర్ లెనిన్, సీహెచ్ సుధాకర్, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ఎదుట టీయూడబ్ల్యూజే హెచ్ -143 ఎదుట జిల్లా నాయకులు ఆందోళనకు దిగారు. జిల్లా నాయకులు అమరేందర్, వెంకట్, వెంకటేశ్వర్లు, రవిచంద్ర పాల్గొన్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి.