హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-252ను సవరించాల్సిందేనని టీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది. డెస్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ల బదులు మీడియా కార్డులు ఇస్తామనడం సబబు కాదని, ఇది ఏరకంగా చూసినా వివక్షే అని టీయూడబ్ల్యూజే(143) స్పష్టంచేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత డెస్ జర్నలిస్టులు సాధించుకున్న హకు అక్రెడిటేషన్లు అని, దానిని యథాప్రకారం కొనసాగించాలని సంఘం నేతలు అల్లం నారాయణ, ఆస్కాని మారుతిసాగర్ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 జర్నలిస్టు సంఘాలతో సమావేశమయ్యారు.
జీవో-252పై జర్నలిస్టు సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రి పొంగులేటి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రామచంద్రమూర్తి కమిటీ వేసి జీవో-239 విడుదల చేసిందని, 23వేల అక్రెడిటేషన్లు జారీ అయ్యాయని అల్లం నారాయణ, మారుతిసాగర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా కార్డులు జారీ చేయలేదని విచారం వ్యక్తంచేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక స్థితి ఉన్నదని, పత్రికల్లో టాబ్లాయిడ్స్ ఉండటం వల్ల మండలాల్లో స్థానిక విలేకరుల వ్యవస్థ వృద్ధి చెందిందని, అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమంలో పాల్గొన్న అన్ని రకాల జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడంలో భాగంగా డెస్ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు జారీ అయినట్టు వివరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన జీవో-252 ప్రకారం ప్రధాన స్రవంతి పత్రికలు, చానళ్లకు అంతకుముందు ఉన్న అక్రెడిటేషన్ల సంఖ్య సగానికి తగ్గనున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో అమల్లో ఉన్న జీవో-239 ప్రకారం బిగ్ పేపర్లకు 20 మంది కరస్పాండెంట్లు, 20 మంది డెస్ జర్నలిస్టులు, నలుగురు కెమెరామెన్లకు అక్రెడిటేషన్లు మంజూరు చేసేవారని, ప్రస్తుతం జీవో-252 ద్వారా ఈ సంఖ్య 12 కరస్పాండెంట్లు, 12 డెస్ జర్నలిస్టులు, ముగ్గురు కెమెరామాన్లకు తగ్గిందని ఆందోళన వ్యక్తంచేశారు.
జిల్లా స్థాయిలో కూడా ఈ తరహా కోతనే విధించారని అల్లం నారాయణ పొంగులేటికి వివరించారు. గతంలో కేబుల్ చానళ్లకు ఐఅండ్ పీఆర్ ద్వారా రాష్ట్రస్థాయిలో 12 అక్రెడిటేషన్లు మంజూరు చేసేవారని, ప్రస్తుతం వాటిని పూర్తిగా సున్నాకు పరిమితం చేయడం ఆందోళన కలిగించే అంశమని వివరించారు. డెస్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అన్న తేడా లేకుండా అందరినీ మీడియా అక్రెడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించే విధంగా, జర్నలిస్టుల ఉపాధి, గౌరవం, హకులను పరిరక్షించేలా జీవో-252ను సవరించాలని అల్లం నారాయణ, మారుతిసాగర్, ఇతర జర్నలిస్టు యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. అక్రెడిటేషన్లకు కోత పెడితే ఉద్యమిస్తామని మారుతిసాగర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులను తగ్గిస్తుందనే ప్రచారం అవాస్తవమని, గతంలో కంటే ఎక్కువగానే మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల సూచనలను సర్కార్ పరిగణనలోకి తీసుకుంటుందని, జీవో-252లో సవరణలు చేస్తామని తెలిపారు. అక్రెడిటేషన్, మీడియా కార్డులకు ఎలాంటి వ్యత్యాసం లేదని, రెండు కార్డుదారులకు అన్నీ సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
రాష్ట్రంలో మండలానికో విలేకరి ప్రాతిపదికన కాకుండా జనాభా వారీగా అక్రెడిటేషన్లు మంజూరు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంపై ఆలోచిస్తామని, దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని కోరారు. కోర్టు అడ్డంకులు లేని ఇండ్ల స్థలాల మంజూరు విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు కొట్టివేయడంతో జేఎన్జే సొసైటీ సమస్య మొదటికి వచ్చిందని చెప్పారు. సమావేశంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్వో మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.